13-11-2025 12:13:20 AM
రైతులకు అవగాహన కల్పించాలంటున్న ప్రజలు
వనపర్తి, నవంబర్ 12 (విజయక్రాంతి) : రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యం పంటను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. ఉదయం ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు చేసి రాత్రిళ్లు అక్కడే ఉంచుతున్నారు. రాత్రి సమయంలో కుప్పలు గమనించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
కల్లాల ఏర్పాటుకు అవగాహన కల్పించడం లో విఫలం..
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు కల్లాలను ఏర్పాటు చేయడంపై అంతగా దృష్టి సారించకపోవడంతో రైతులు పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు నానా అవస్థలను ఎదుర్కొంటున్నారు. ప్రతి సీజన్లో రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే పండించిన పంటలను ఆరబెట్టుకోవడం మరొక ఎత్తుగా రైతులు ఒక దీక్ష వలె చేయాల్సిన పరిస్థితి తయారైంది.
జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఆశించిన మేరకు రైతులకు కల్లాలు లేకపోవడంతో ప్రధాన రోడ్లపైనే రైతులు వారి పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు రోడ్లపైనే కుప్పలుగా పోసి చదును చేసి ఆరబెట్టుకుంటున్నారు. రైతులకు పంట ఉత్పత్తులు ఆరబెట్టుకునేందుకు స్థలం లేకపోవడంతో రైతులు పోసిన రోడ్ల పైన వరికుప్పలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. రైతులు ప్రధాన రహదారిలోనే వారి పంటలను కుప్పలుగా పోసుకొని ఆరబెట్టు కుంటుండడంతో రోడ్ల పైన ప్రయాణించేందుకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు వాహనదారులు జంకుతున్నారు.
అవగాహన కల్పిస్తే..
రైతులు ధ్యానం అరబెట్టుకునేందుకు కల్లాలను తమ వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసుకుంటే మంచింది. దీని వల్ల వరిని కోసి అక్కడే ఎండబెట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. సంబంధిత అధికారులు రైతులకు అవగహన కల్పించి కల్లాల ఏర్పాటు చేయించగలిగితే ప్రమాదాల బారిన పడకుండా నివారించవచ్చని ప్రజలు కోరుతున్నారు.