calender_icon.png 13 November, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు

13-11-2025 12:00:00 AM

  1. మధ్యాహ్ననికల్లా తేలనున్న ఫలితం
  2. యూసుఫ్‌గూడ స్టేడియంలో పకడ్బందీ ఏర్పాట్లు
  3.   10 టేబుళ్లు, 42 రౌండ్లలో లెక్కించనున్న సిబ్బంది

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితానికి సమయం ఆసన్నమైంది. గురువారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియం లో కౌంటింగ్ ప్రక్రియ జరగనుండగా, మధ్యా హ్నం ఒంటిగంటకల్లా విజేత ఎవరో తేలిపోయే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు.

మొత్తం 4,01,365 ఓట్లకు గాను, పోలింగ్ రోజున 1,94,622 ఓట్లు పోలయ్యాయి. బరిలో ఉన్న 58 మంది అభ్యర్థుల భవి తవ్యం రేపు తేలనుంది. ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లను రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో తెరిచి, మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ను, ఆ తర్వాత హోమ్ ఓటింగ్ ద్వారా పోలైన ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో డివిజన్‌ల వారిగా ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. కౌంటిం గ్ కోసం మొత్తం 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ 42 రౌండ్లలో పూర్తి కానుంది. ప్రతి రౌండ్ ఫలితాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు, రాజకీయ పార్టీల ఏజెంట్లకు వెల్లడించనున్నారు. లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేం దుకు, కౌం టింగ్ విధుల్లో పాల్గొనే మైక్రో అబ్జర్వర్లకు నేడు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మొదట షేక్‌పేట్.. చివరగా ఎర్రగడ్డ

లెక్కింపు ప్రక్రియను పోలింగ్ స్టేషన్ల వారీగా చేపట్టనున్నారు. మొదట షేక్‌పేట్ డివిజన్‌లోని పోలింగ్ స్టేషన్ 1 నుంచి 42 వరకు ఉన్న ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత మిగిలిన 6 డివిజన్ల ఓట్లను వరుసగా లెక్కిస్తూ, చిట్టచివరగా ఎర్రగడ్డ డివిజన్‌లోని 407వ పోలింగ్ స్టేషన్ ఓట్ల లెక్కింపుతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత

కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కేంద్ర బలగాలతో సహా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు నగరంలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

ఈ సమయంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడంపై సంపూర్ణ నిషేధం ఉంటుంది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా ఏర్పడటం నిషిద్ధం. లెక్కింపు సందర్భంగా జూబ్లీహిల్స్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులతో సహా మద్యం అమ్మే అన్ని సంస్థలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. 

స్వల్పంగా పెరిగిన ఓటింగ్ శాతం

  1. జూబ్లీహిల్స్‌లో 48.49 శాతం నమోదైనట్టు వెల్లడించిన అధికారులు
  2. గత ఎన్నికలతో పోలిస్తే 0.91% పెరుగుదల

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): మంళవారం సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసే సమయానికి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారికి, జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి తుది పోలింగ్ శాతాన్ని అధికారికంగా బుధవారం ప్రకటించారు.

హోరాహోరీగా సాగిన ప్రచారం నేపథ్యంలో, ఈ ఉపఎన్నికలో పోలింగ్ శాతం గత సాధారణ ఎన్నికల కంటే స్వల్పంగా పెరగడం గమనారం. 2023లో జరిగిన సాధారణ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 47.58 శాతం ఓట్లు పోలవగా, ఈ ఉపఎన్నికలో అది 48.49 శాతానికి చేరింది. అంటే, గతంతో పోలిస్తే 0.91 శాతం ఓటింగ్ పెరిగింది. పెరిగిన ఈ ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలిస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.