29 May, 2026 | 2:27 AM

మెదక్ జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

29-05-2026 01:35 AM

ధాన్యం కొనుగోలు సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, మే 28 (విజయక్రాంతి): అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని జిల్లాల్లో ధాన్యం తడిసిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వేగంగా కొనుగోళ్లు నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు  అకాల వర్షాల ప్రభావంతో ధాన్యం తడిసిన  సుమారు 04వేల క్వింటాళ్ల ధాన్యం బాయిల్ మిల్లులకు తరలించామన్నారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. అనుకొని పరిస్థితుల వర్షాలతో ధాన్యం తడిసినా, నిబంధనల ప్రకారం పరిశీలించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం రైతులకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 62103. రైతుల నుండి 2,85,054.080  మెట్రిక్ టన్నుల ధాన్యం  కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 43,433 మంది రైతులకు 468.18 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 30 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. రైతులకు ధాన్యం కొనుగోలులో సమస్యలు, సందేహాల పరిష్కారం కోసం జిల్లా సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్/కంట్రోల్ రూం నంబర్. 9391942254ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.