29 May, 2026 | 2:10 AM

అప్పుల తిప్పలు

29-05-2026 01:34 AM
  1. ప్రభుత్వం మారినా మాజీ సర్పంచ్‌లకు అందని బకాయిలు 
  2. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు సుమారు రూ.1,000 కోట్ల వరకు పెండింగ్
  3. బిల్లుల కోసం పోరుబాట రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
  4. జూన్ 1న ‘ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్’కు పిలుపు

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి) : తెలంగాణలో మాజీ సర్పంచులు గతం లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇంకా అందలేదు. అప్పులు తెచ్చి చేయించిన పనులకు.. బకాయిలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మారినా బిల్లులు విడుదల చేయకపోవడంతో పోరుబాట పట్టారు. మాజీ సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు, వినతిపత్రాల ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు. జూన్ 1న ‘ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్’కు సిద్ధమవుతున్నా రు.

2019 నుంచి 2024 మధ్య గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పల్లెప్రగతి పనులు, వైకుంఠధామాలు, తాగునీటి పైపులైన్లు, పంచాయతీ భవనాలు, వీధి దీపాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాయి. చాలామంది సర్పంచులు అప్పులు తెచ్చి, కాంట్రాక్టర్లకు నచ్చజెప్పి పనులు పూర్తి చేయించారు. కొందరు తమ ఆస్తు లు తాకట్టు పెట్టగా, మరికొందరు వడ్డీల కు తెచ్చి ఖర్చు చేశారు. పనులు పూర్తయి ఏళ్లు గడిచినా, ప్రభుత్వం మారినా పెం డింగ్ బిల్లులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రూ.1,000 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని సంబంధిత సంఘాల నాయకులు చెబుతున్నారు.   

గ్రామాభివృద్ధి కోసం చేసిన అప్పులు మాజీ సర్పంచ్‌లకు భారంగా మారాయి. బ్యాంకుల నుంచి నోటీసులు, కాంట్రాక్టర్లు, మెటీరియల్ సరఫరాదారులు, అప్పులిచ్చిన వారి నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో గౌరవంగా తిరిగిన తాము.. ఇప్పుడు అప్పుల కారణంగా అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబాల్లో కలహాలు, ఆస్తుల అమ్మకాలు, పిల్లల చదువులపై ప్రభావం వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయని వాపోతున్నారు.

కొందరు మాజీ సర్పంచులు మానసిక వేదనతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు పరిస్థితి తీవ్ర తను స్పష్టం చేస్తున్నాయి. గ్రామాభివృద్ధి కోసం అప్పులు తెచ్చి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడం పంచాయతీరాజ్ వ్యవస్థకే అవమానమని,  వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.     

రాజకీయ కక్ష సాధింపులేనన్న ఆరోపణలు!

పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వంపై మాజీ సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిపాలనా ఆలస్యంకాదని, రాజకీయ కక్ష సాధింపేనని ఆయా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నా రు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి ఎక్కువగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే ప్రస్తుత సర్కార్  ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో తమ సమస్యల ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనల మార్గాన్ని ఎంచుకున్నారు. తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో ధర్నాలు, ర్యాలీలు, వినతిపత్రాల ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.

ప్రజాభవన్ ముట్టడి, కలెక్టరేట్‌ల ఎదుట నిరసనలు, రాస్తారోకోలు చేయడం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో జూన్ 1న ‘ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్’ కార్యక్రమానికి జేఏసీ పిలుపునిచ్చింది. మాజీ సర్పం చులు భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు తరలిరావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మం త్రి సీతక్క దృష్టికి తమ సమస్యలను నేరుగా తీసుకెళ్లాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు. ఈ సమస్య కేవలం పెండింగ్ బిల్లుల అంశం కాదని, ఆత్మగౌరవ సమస్య అని.. బిల్లులు వచ్చే వరకు పోరాటం ఆగదని జేఏసీ స్పష్టం చేసింది.