11-11-2025 05:48:34 PM
జల్లెల పెంటయ్య
నకిరేకల్ (విజయక్రాంతి): మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రామన్నపేట స్థానిక సీపీఎం మండల కార్యాలయంలో బల్గురి అంజయ్య అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను పోసి, వాతావరణం సహకరించక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు అనేకమంది రైతుల ధాన్యం తడిసి మొలకెత్తిందని, అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనకపోవడం రైతుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోందని అన్నారు. రైతులకు తార్పులు, కూలీల ఖర్చులు అదనంగా భారం అవుతున్నాయి.
లారీలు, భార్దానాలు, హమాలీల కొరత లేకుండా వెంటనే కొనుగోలు జరగాలి," అని పెంటయ్య డిమాండ్ చేశారు. అలాగే, రైస్‌మిల్లులు కోర్రెల పేరుతో కోత విధిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నాయని, అధికారులు, మిల్లర్ యాజమాన్యాలు కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడితే సీపీఎం ఊరుకోదని హెచ్చరించారు. వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు కూరెళ్ళ నర్సింహాచారి, బోయిని ఆనంద్, కందుల హనుమతు, జంపాల అండాలు, రైతు సంఘం మండల అధ్యక్షులు గన్నేబోయిన విజయభాస్కర్, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, నాయకులు గొరిగే సోములు, బావండ్లపల్లి బాలరాజు, వేముల సైదులు, ఆవనగంటి నగేష్, శాఖ కార్యదర్శులు మునికుంట్ల లెనిన్, శానగొండవెంకటేశ్వర్లు, గుండాల ప్రసాద్, గంగాదేవి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.