24-05-2025 01:31:47 AM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, మే 23 (విజయ క్రాంతి): ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించిన ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు.
జిల్లాలోని సీరోలు, మహబూబాబాద్, కురవి మండలాల్లోని కొత్తూరు, అయ్యగారి పల్లి, నేరెడ, కురవి, మాదాపురం, గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత కేంద్రాలలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం, ఇంకా కొనడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాల నమోదు రిజిస్టర్ ను పరిశీలించారు.
కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని రవాణా చేసే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సంబంధిత సెంటర్ నిర్వాహకులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత వాతా వరణ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు పడే అవకాశం ఉందని అందుకు తగిన ఏర్పాట్లను సెంటర్ నిర్వాహకులు రైతులకు కల్పించాలని, రైతును కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. గన్ని సంచులు, టార్పాలిన్సు, తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, అన్లోడ్ చేసిన లారీలను అవసరం ఉన్న చోటకు వెంట వెంటనే పంపాలని తద్వారా ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు. హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలనీ, లారీ కాంట్రాక్టర్స్, రైస్ మిల్లర్లు, సెంటర్ నిర్వాహకులు సంబంధిత క్లస్టర్ సిబ్బంది, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తరచుగా సందర్శించి, ఎలాంటి జాప్యం లేకుండా వారం రోజుల లోపు జిల్లాలోని ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి వారికి డబ్బులు వెంటనే ఖాతాలో జమ చేసే విధంగా వ్యవసాయ శాఖ, సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసిల్దార్లు, విజయ, రాజేశ్వరరావు, పున్నం చందర్, తదితరులున్నారు.