24-05-2025 01:29:58 AM
మహబూబాబాద్, మే 23 (విజయ క్రాంతి): తాము అడిగిన బ్రాండ్ల బీర్లు అమ్మకుండా, షాపు యజమానులు వారికి నచ్చిన బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తున్నారని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో వైన్ షాపు వద్ద మద్యం ప్రియులు నిరసనకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మద్యం షాపుల్లో తమకు నచ్చిన బ్రాండ్ల బీర్లు అమ్మడం లేదని, బయట బెల్ట్ షాపుల్లో విక్రయిస్తున్నారని, ఇక్కడ దొరకని బ్రాండ్లు అక్కడ ఎలా విక్రయిస్తున్నారని ఓ మద్యం షాప్ ఎదుట ఆందోళనకు దిగి షాపు షట్టర్ మూయడానికి యత్నించారు. దీనితో మద్యం ప్రియులకు షాపు నిర్వాహకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.
బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు బీర్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని, అదే షాపుల్లో అయితే ఎమ్మార్పీకి కొనడానికి అనుకూలంగా ఉంటుందని, ఎక్సైజ్ అధికారులు స్పందించి అన్ని రకాల బ్రాండ్లకు చెందిన బీర్లు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.