ధాన్యం కొనుగోళ్లు వారంలో పూర్తి కావాలి
పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రాంచంద్రన్
యాదాద్రి భువనగిరి, మే 24 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో ధాన్యం కొనుగోల్లు పూర్తి కావాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రాంచంద్రన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, నర్సరీలను, మహి ళా సంఘాల పనితీరును పరిశీలించారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన ఆమె అక్కడ ధాన్యం మూడు రోజుల్లో కొనుగోలు చేసి కేంద్రాన్ని మూసివేయాలని సూచించారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరిపి వేగంగా తూకాలు జరిగే విధంగా కృషి చేయాలని, జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో కొనుగోల్లు పూర్తి కావాలని కోరారు.
అనంతరం నర్సరీని సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. తదుపరి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను పరిశీలించి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన తాగునీరు, టాయిలెట్స్ పనులను పరిశీలించి జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని కమిటీ ప్రతినిధులను కోరారు. చిన్నకోడూరు గ్రామంలో చౌటుప్పల్ మండల సమాఖ్య ఆధ్వర్యంలోని కుట్టు కేంద్రం పరిశీలించి విద్యార్థులకు యూనిఫామ్స్ పనులను పరిశీలించారు.






