10 August, 2026 | 3:40 AM

ఘనంగా నల్ల పోచమ్మ తల్లి బోనాలు

10-08-2026 01:50 AM

చంపాపేట్, అగస్టు 9(విజయక్రాంతి): ఆషాఢ బోనాల సందర్భంగా చంపాపేట్ సర్కిల్ పరిధిలోని డివిజన్లో గల బాలాజీ నగర్ కాలనీ రెడ్డి కాలనీ కాలనీలో ఆదివారం నల్లపోచమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఉదయం ఘటాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం కాలనీ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను అలంకరించి పోచమ్మ అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు పారించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

బడంగ్‌పేట్, ఆగస్టు 9: విజయక్రాంతి  ప్రాంతాల్లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వివిధ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బోనాల ఉత్సవాల్లో మహేశ్వరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రజలు బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంపై అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తీగల కృష్ణారెడ్డితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

కాలిమందిర్‌లో.. 

రాజేంద్రనగర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు ఆదివారం ఉదయం నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి. ఆషాడ మాసం చివరి ఆదివారం రోజు కావడంతో భాగ్యనగరం మమత అమ్మవారి బోనాల తో ప్రత్యేక శోభా సంతరించుకుంది. కాళీ మందిర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కొలువైన పోచమ్మ,ఎల్లమ్మ, మైసమ్మ, భవాని, మహంకాళి తదితర అమ్మవార్ల ఆలయాలకు బోనాలు సమర్పించేందుకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు.

మహిళలు వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలు నెత్తిన పెట్టుకొని అమ్మవారి ఆలయాలకు బయలుదేరారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బెల్లం సాకపోసి బోనం నైవేద్యంతో పాటు గాజులు చీరసారే సమర్పించి చల్లంగా చూడాలని వేడుకుంటున్నారు.

పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులు చప్పులతో ఎటు చూసినా నగరం అంతా హోరెత్తుతుంది. లాల్ దర్వాజా సింహా వాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించగా అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీధర్ బాబు, అంబర్పేట అమ్మవారి ఆలయంలో ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ కార్పొరేటర్లు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు

ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీరాములు 

బడంగ్‌పేట్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్, బడంగ్పేట్, ప్రశాంతి హిల్స్, ఆర్కేపురం డివిజన్లలోని అమ్మవారి ఆలయాలను  నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. ఆషాడ మాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అనంతరం బడంగ్‌పేట్‌లో టీం మహకల్  ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న మహా తొట్టెల ఊరేగింపులో తొట్టెలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు,  స్థానిక బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.