వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం
ఏఐవైఎఫ్ 4వ మండల మహాసభ
బెజ్జంకి, ఆగస్టు 9 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల శంకర్ విమర్శించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం ఏఐవైఎఫ్ 4వ మండల మహాసభను జిల్లా మాజీ అధ్యక్షులు బోనగిరి శ్రావణ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. మహాసభకు ప్రతీకగా జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్ యువజన సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచడం, కాంట్రాక్టీకరణఔట్సోర్సింగ్ను ప్రోత్సహించడం వల్ల శాశ్వత ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, విద్యవైద్య రంగాల వాణిజ్యీకరణ యువత భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసి, యువతకు ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకురావాలని కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో జరగనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల్లో యువజన సమస్యల పరిష్కారం, విద్య ఉపాధి హక్కుల సాధన, రాజ్యాంగ విలువల పరిరక్షణపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్, నాయకులు మిద్దె రవి, నరేష్, రాకేష్, బాబు, చరణ్, లక్ష్మణ్, బాలమల్లు, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






