సంగారెడ్డిలో ఘనంగా వనమహోత్సవం
మొక్కలు నాటిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఆగస్టు 25: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా అందరూ శ్రమించాలని డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా మంగళ వారం సంగారెడ్డి పట్టణంలోని 33వ వార్డులో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మున్సిపల్ చైర్ పర్సన్,వార్డు కౌన్సిలర్, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఖాళీ స్థలాలలో మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూపెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, సకాలంలో వర్షాలు కురవడానికి చెట్లే ప్రధాన ఆధారం అన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించి వృక్షాలుగా మార్చే బాధ్యతను కూడా స్థానిక ప్రజలు, యువత తీసుకోవాలని కోరారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని పచ్చదనంతో నింపేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ ,కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్,కౌన్సిలర్ లు శ్రీకాంత్ గౌడ్, వంశీ, సంగీత మహేష్, రమేష్,అశ్విన్ , కాంగ్రెస్ నాయకులు శివుడు,గడ్డం రాజు, ప్రవీణ్, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.






