26 August, 2026 | 1:26 AM

మరో ఉద్యమానికి గులాబీ దళం శ్రీకారం

26-08-2026 12:09 AM

29న అమీన్ పూర్ వేదికగా పోరుబాట

15 వేల మందితో భారీ నిరసన సభ

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డ్డి

పటాన్ చెరు, ఆగస్టు 25: పటాన్ చెరు నియోజకవర్గంలో 22ఎ నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్స్, ప్లాట్ల బాధితులకు అండగా నిలిచేందుకు గులాబీ దళం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 29న పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్ పూర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంగళవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గం పరిధిలోని బిఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులతో నిరసన కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 22-ఎ భూముల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.  తన్నీరు హరీష్ రావు  ఆదేశాల మేరకు ఆగస్టు 29, శనివారం అమీన్ పూర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు.  సుమారు 15 వేల మంది నిరసన సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.