కారుణ్య నియామకాల గరిష్ఠ వయోపరిమితి పెంపు
సింగరేణి వారసులకు తీపికబురు
35ఏళ్ల నుంచి 40ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు
తక్షణమే దాదాపు 300 మందికి లబ్ధి
వెంటనే నియామకాలు చేపడుతాం: సీఎండీ
హైదరాబాద్, జూన్ 11 ( విజయక్రాంతి): సింగరేణి వారసులకు యాజమాన్యం తీపికబురు చెప్పింది. సంస్థలో కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇదివరకు గరిష్ఠ వయో పరిమితి 35 ఏళ్లు ఉండగా.. దాన్ని 40ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంగళవారం సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ పేర్కొన్నారు.
ఇటీవల హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో సింగరేణి బదిలీ వర్కర్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లను ఇస్తున్న సమయంలో.. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వయో పరిమితి అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎండీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఈ నేపథ్యంలో సింగ రేణి డైరెక్టర్ల సమావేశాన్ని నిర్వహించి.. ఈ అంశంపై చర్చించి.. కారుణ్య నియామకాల వయో పరిమితి పెంపునకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ వెల్లడించారు.
2018 మార్చి 9వ తేదీ నుంచి వయోపరిమితి సడలింపు స్కీమ్ వర్తిస్తుంది. సింగరేణి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 300 మందికి తక్షణమే లబ్ధి చేకూరనుంది. అలాగే, భవిష్యత్‌లో మరింత మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇన్నాళ్లు వయోపరిమితి దాటిన వారు కారుణ్య ఉద్యోగాల కోసం నకిలీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించేవారు. దీని వల్ల విజిలెన్స్ కేసులను ఎదుర్కొనేవారు. ఫలితంగా ఉద్యోగం కోల్పోవడంతోపాటు వచ్చే బెన్‌ఫిట్స్ కూడా వారికి దక్కేవి కాదు. ఇప్పుడు వయోపరిమితిని పెంచడం వల్ల ఇక మీద అలాంటి తప్పుడు ధోరణులకు అవకాశం ఉండదని సీఎండీ అభిప్రాయపడ్డారు.
కారుణ్య నియామకాలు అంటే..
సింగరేణి సంస్థలో కార్మికుడు లేదా ఉద్యోగి అకాల మరణం చెందినట్లయితే, ఆయన స్థానంలో అతని వారసుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తుంటారు. అలాగే అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగానికి అనర్హులుగా మెడికల్ బోర్డు ప్రకటించిన కార్మికుల వారసులను కూడా సింగరేణి సంస్థ బదిలీ వర్కర్‌గా ఉద్యోగాన్ని ఇస్తుంది. ఈ రెండు కారణాలతో సంస్థలో కార్మికుల వారసులను ఉద్యోగిగా తీసుకోవడాన్నే కారుణ్య నియామకం అంటారు.
పైన చెప్పిన రెండు కారణాల్లో కూడా వారసుడికి ఉద్యోగం కల్పించాలంటే.. అతని కనిష్ట వయసు 18ఏళ్లు, గరిష్ఠ వయసు 35ఏళ్లు ఉండాలని నిబంధనలు చెబుతున్నారు. అయితే కరోనా సమయంలో రెండేళ్ల పాటు మెడికల్ బోర్డు స్తంభించిపోయింది. దీని వల్ల కారుణ్య నియామకాలు ఆగిపోయి.. వారసులు తీవ్రంగా నష్టపోయారు. ఫలితంగా వారు గరిష్ట వయో పరిమితిని దాటిపోయారు. ఈ క్రమంలో వయోపరిమితిని పెంచాలని చాలా కాలంగా కార్మికులు, కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యానికి మెరపెట్టుకుంటున్నాయి. చివరికి సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో వయోపరిమితిని సవరిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
కార్మికులు హర్షం
సింగరేణి యాజమాన్యం వయో పరిమితిని పెంచడంపై కార్మికులతో పాటు కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తాము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వయో పరిమితి పెంపుపై సీఎం, డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి, యాజమాన్యం ద్వారా ఉత్తర్వులు జారీ చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా పాలనలో కూడా ఈ విషయంపై అనేకమంది దరఖాస్తులు పెట్టుకున్నారని వెల్లడించారు.
అర్హులకు వెంటనే ఉద్యోగాలిస్తాం
వయో పరిమితిని 40ఏళ్లకు సవరించిన నేపథ్యంలో.. ఆ ఉత్తర్వుల ప్రకారం అర్హులకు వెంటనే ఉద్యోగాలు కల్పిస్తాం. 2018, మార్చి 9 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది. దీంతో సింగరేణిలోని అన్ని ఏరియాల్లోని అర్హులు దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఇప్పటికే ఉద్యోగం బదులు బెన్ ఫిట్స్‌కు సంబంధించిన మొత్తం సొమ్ము తీసుకున్నవారు కానీ, ఇది వరకే వారసుడికి ఉద్యోగాన్ని పొందిన వారు కానీ, మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హలు. అలాంటి వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దు. ఎటువంటి సెటిల్‌మెంట్లు జరగని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎన్. బలరామ్, సింగరేణి సీఎండీ






