01-10-2025 12:14:08 AM
మంచిర్యాల, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు కప్పిపుచ్చేందుకు నజరానాల వర్షం కురిపిస్తున్నారు. కార్యాలయం జిల్లా కేంద్రానికి దూరంగా హాజీపూర్ మండలం (ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని) వేంపల్లి శివారులో ఉండటంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
ఏదైన పనిమీద కార్యాలయంలోకి వెళ్లాలంటే బయట ఉన్న కానిస్టేబుళ్లు అడ్డుకుంటారు. వారికి ఫలానా అని సమాచారం ఇస్తే చాలూ లోపలంతా గప్ చుప్ కావాల్సిందే. గతంలో అధికారులు, కన్సల్టెంట్ బ్రోకర్లు మందు, విందుతో చిందులేయగా పత్రిక విలేకరులకు చిక్కిన విషయం విధితమే. ఆనాడు మొదలు పెట్టిన నజరానాల ఆనవాయితీ కొనసాగుతుందనడానికి మం గళవారం జరిగిన సంఘటనలే నిదర్శనం.
విలేకరులకు కేటగిరీల వారిగా పంపకాలు
రవాణ శాఖ కార్యాలయంలో అధికారులు విలేకరులను కేటగిరీల వారిగా విభజించి పంపకాలకు శ్రీకారం చుట్టారు. ఒక కేటగిరీకి రూ.10 వేలు (జిల్లా బాస్‌లకు), ఇంకో కేటగిరీకి రూ.5 వేలు (స్ట్రింగర్లు, డిపార్టుమెంటు విలేకరులకు), రూ.2 నుంచి రూ.3 వేలు చిన్న పేపర్లకు అని విభజించి మంగళవారం ఎన్వలప్ కవర్లలో పెట్టి మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద గల మంచిర్యాల ఆటోకన్సల్టెంట్‌లో ఒక్కొక్కరికి సమాచారం అందిస్తూ వచ్చిన వారికి కవర్లు అందజేశారు. ఫోన్ చేసింది సైతం డీటీవో కార్యాలయంలోని ఒక కానిస్టేబులే. అధికారులకు తొత్తుగా ఉండే ఓ రిపోర్టరు చెప్పిన విధంగా డీటీవో, ఎంవీఐలు మెదలుతుంటారనే ఆరోపణలు సైతం లేకపోలేదు.
ఓ రిపోర్టరు చేతుల్లోనే అంతా!
డీటీవో (ఆర్‌టీఓ) కార్యాలయంలో జరిగే ఏ కార్యక్రమం అయినా కొందరికే సమాచారం ఉంటుంది. అది కూడా ఓ విలేకరి అడ్మిన్‌తో ఏర్పాటు చేసిన ఆ వాట్సాప్ గ్రూపులో మాత్రమే అధికారులు పోస్టు చేస్తుంటారు. అది ఆ గ్రూపులోని సభ్యులకే సమాచారం అందుతుంది. ఏ కార్యాలయానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపునకు సంబంధిత శాఖకు చెందిన అధికారులే ప్రధానంగా అడ్మిన్‌గా ఉంటారు.
ఇక్కడ మాత్రం ఆ విలేకరి ఉండటం గమనార్హం. డీటీవో కార్యాలయ సమాచారం కోసం ఆ గ్రూపులో మిగితా రిపోర్టర్లను ఆడ్ చేయాలని కోరినా సదరు విలేకరి పట్టించుకోడు. ఈ కార్యాలయంలో అంతా ఆ విలేకరి చెప్పినట్టుగానే జరుగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.
అక్రమాలు కప్పిపుచ్చేందుకునేందుకేనా?
అసలే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. సదరు అధికారులు పత్రికలకు యాడ్స్ ఇచ్చే అవకాశం లేదు. మరి మంగళవారం విలేకరులకు పంపకాలు చేసిన డబ్బులు ఎందుకోసమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో జరిగే అవినీతి, అక్రమాలు బయటకు పొక్కినా ఏం రాయవద్దనే ఉద్దేశంతోనే ఈ పంపకాలు జరిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు విలేకరులు సదరు అధికారులు పంపించిన నజరానాలు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మరి కొందరేమో ఓ రిపోర్టరుకు తొత్తులుగా మారి వారు చెప్పిన వారికే డబ్బులు అందజేసిన విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.