01-10-2025 12:56:52 AM
దసరా కానుకగా పోలీస్ స్టేషన్
మహబూబాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా మండలంగా ఏర్పాటు చేయాలని ఇనుగుర్తి వాసుల కోరిక గత ప్రభుత్వ హాయంలో మండల ఏర్పాటు ప్రకటనతో నెరవేరింది. అయితే మండలంలో ఏర్పాటు కావలసిన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో ఆ తరువాత కాలయాపన జరిగింది. ఈ క్రమంలో కేవలం మండల ప్రకటనతోనే సరిపెట్టారంటూ ఇనుగుర్తి వాసులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీనితో తొలుత తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ కొంతకాలం పాటు మండలానికి సరిహద్దుల నిర్ణయం చేయకపోవడం, వివిధ ధ్రువీకరణ పత్రాలకు కేసముద్రం మండలం నుండి జారీ చేశారు. మళ్లీ ఇనుగుర్తి వాసులు ఆందోళన చేపట్టడంతో రెవిన్యూ సరిహద్దులు నిర్ణయించి, రెగ్యులర్ తహసిల్దార్ ను నియమించారు.
సర్టిఫికెట్ల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మండల వ్యవసాయ అధికారుల నియామకం నేపథ్యంలో ఇనుగుర్తి మండలానికి కొత్తగా ఏవో ను నియమించింది. ఆ తర్వాత మరికొంత కాలానికి మండల పరిషత్ కార్యాలయం మంజూరు చేశారు. అలాగే మండల విద్యాశాఖ కార్యాలయం కూడా మంజూరు చేశారు. ఇప్పటికే ఇనుగుర్తి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండడంతోపాటు పశువైద్యశాల కూడా ఉంది.
అలాగే వాణిజ్య బ్యాంకు కూడా ఏర్పాటు గతంలోనే జరిగింది. ఇక మిగిలింది ఏకైక పోలీస్ స్టేషన్ మాత్రమే. పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం కూడా కొంతకాలం నుంచి ఇనుగుర్తి వాసులు ఎదురుచూస్తున్నారు. ఇనుగుర్తి మండల పరిధిలోకి కేసముద్రం, నెల్లికుదురు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలను చేర్చడంతో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇరుకుర్తి మండల పరిధిలో ఉన్న ఆయా గ్రామాల ప్రజలు అటు కేసముద్రం,
ఇటు నెల్లికుదురు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో పోలీస్ స్టేషన్ ఏర్పాటు అంశం పై కూడా మండల ప్రజలు పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన ఇనుగుర్తి మండలం లో మంగళవారం పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు.
దీనితో ఇనుగుర్తి మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అయితే కొత్తగా ఏర్పడ్డ వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు రెగ్యులర్ అధికారులను నియమించకుండా, అదనపు బాధ్యతలపై నియమించడం పట్ల ఇనుగుర్తి మండల వాసులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా ఏర్పడ్డ ఇనుగుర్తి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లడానికి ప్రభుత్వం అన్ని శాఖలకు రెగ్యులర్ అధికారులను నియమించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా దసరా కానుకగా ఇనుగుర్తి మండలానికి కొత్తగా పోలీస్ స్టేషన్ మంజూరు చేయడం పట్ల మండల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.