8న ఇస్కాన్ సైబరాబాద్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ
కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): ఇస్కాన్ సైబరాబాద్ ఆలయం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ఈ నెల 8న ఆదివారం జరుగుతుందని సైబరాబాద్ ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు శ్రీరామదాసు తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో శ్రీరామదాసు మాట్లాడారు. హైదరాబాద్ నల్లగండ్ల శ్రీరంగనాథ స్వామి ఆలయం పక్కన ఇస్కాన్ నిర్మించనున్న ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందని చెప్పారు.
ఈ ఆలయం సమాజం మొత్తానికి మేలు చేకూర్చే వేద సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయబడుతుందని, అవసరమైన వారికి ఉచితంగా భోజనం పంపిణీ చేయడానికి మెగా అన్నదాన వం టశాల ఉంటుందని ఆయన తెలిపారు. యువతకు విలువల ఆధారిత విద్య, నైపు ణ్య అభివృద్ధి కోర్సులు, గోశాలలో గోవుల సంరక్షణ, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసారం, కుటుంబాలకు ఆధ్యాత్మిక ఆనందం కలిగించే పవిత్ర స్థలంగా ఈ ఆలయం నిలుస్తుందని చెప్పారు.
అదనంగా ఈ ఆలయంలో శ్రీశ్రీ రాధాకృష్ణ, అష్టసఖి మందిరాలు ఏర్పాటు చేయబడతాయని, ఇవి భక్తికి, ఆధ్యాత్మిక ఉత్తేజానికి పవిత్ర స్థలాలుగా సేవలందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్, ఇస్కాన్ ప్రతినిధులు, ప్రభుత్వ, పోలీస్ అధికారులు పాల్గొంటారని శ్రీరామదాసు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఇస్కాన్ ప్రతినిధులు సిద్దబాలరాం దాస, వెంకట దాస, కృష్ణ స్మరన్ దాస, ఇస్కాన్ సభ్యులు గోపరాజు శ్రీనివాస్, అరవింద్, సిద్దేశ్, దేవిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.




