మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ!
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో హై అలర్ట్
అడగడుగునూ జల్లెడ పడుతున్న పోలీసులు
భయం గుప్పిట్లో ఏజెన్సీ గ్రామాలు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు నిర్వహించాలనుకున్న వారోత్సవాలకు ముందు ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఫెర్రీ పాయింట్స్ వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ములుగు, ఏటూరునాగారం, తాడ్వా యి, మంగపేట ,ఆళ్లపల్లి, గుండాల, భద్రాచలం, చర్ల, వెంకటాపురం మండలాల్లో భారీగా కూంబింగ్ చేపట్టారు. ఒకవైపు పోలీసుల బూట్ల చప్పుడు, మరోవైపు మావో యిస్టుల కదలికలతో గిరిజన ప్రాతంలో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో చతీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. గ్రేహ్యండ్ బలగాలు, యాంటీ నక్సటైట్ బృందాలు, ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగి గాలింపులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వదులుతున్నారు. అనుమానస్పదంగా కన్పిస్తే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్ నేతలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాగా పోలీసులు ఎదురు కాల్పులు అని చెబుతున్నప్పటికీ, ఆహారంలో విష ప్రయోగం చేసి మావోయిస్టులను హతమార్చారని మానవహక్కులు, పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. పక్కా ప్రణాళికలతో మావోయిస్టులను మట్టుపెట్టినట్లు ఆరోపణలున్నాయి.






