16 July, 2026 | 1:42 AM

రాయల్స్ టాప్ షో

23-04-2024 01:14 AM

రాజస్థాన్ ఏడో విజయం  

యశస్వి సూపర్ సెంచరీ

n ముంబైపై సునాయాస విజయం

వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాయల్స్.. ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసి సీజన్‌లో ఏడో విజయం ఖాతాలో వేసుకుంది. సందీప్ శర్మ ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. ఛేదనలో రాజస్థాన్ రాజసం చూపింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అజేయ శతకంతో జట్టును గెలిపించాడు. 

జైపూర్: సెంచరీ కొట్ట డం ఇంత సులువా అన్నట్లు యశస్వి జైస్వాల్ చెలరేగడంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్ ఏడో విజయం నమోదు చేసుకుంది. సోమవారం వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (45 బంతుల్లో 65; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుత అర్ధశతకంతో ఆకట్టుకోగా.. నేహల్ వధేరా (24 బంతుల్లో 49; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.

రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లు పడగొట్టాడు. రోహిత శర్మ (6), ఇషాన్ కిషన్ (0), సూర్యకుమార్ యాదవ్ (10), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10), టిమ్ డేవిడ్ (3) విఫలమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 18.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 183 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (25 బంతుల్లో 35; 6 ఫోర్లు)సత్తాచాటారు. ముంబై బౌలర్లలో చావాల ఒక  వికెట్ పడగొట్టాడు. లీగ్‌లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. 

జైస్వాల్ ఎట్టకేలకు..

తాజా సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యశస్వి ఈ మ్యాచ్‌లో సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. లీగ్‌లో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో పవర్‌ప్లేలోనే ఔటైన జైస్వాల్.. తాను చివరి వరకు క్రీజులో నిలిస్తే ఎలా ఉంటుందో చాటాడు. బుమ్రా, కోట్జీ, పాండ్యా, చావ్లా ఇలా బౌలర్ ఎవరనేదానితో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడి రాయల్స్‌కు ఒంటిచేత్తో విజయాన్ని కట్టబెట్టాడు. కోట్జీ వేసిన మూడో ఓవర్‌లో 6,4,4 బాదిన జైస్వాల్.. తుషార ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు.

తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం బట్లర్ ఔట్ కాగా.. ధనాధన్ షాట్లతో జైస్వాల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయల్స్ ఇన్నింగ్స్  మధ్య వరుణుడు అడ్డుపడినా.. తర్వాత కూడా జైస్వాల్ జోరు తగ్గలేదు. చెత్త బంతులను బౌండ్రీ దాటించిన యశస్వి ఆడుతూ పాడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నా డు. మరో ఎండ్ నుంచి శాంసన్ చక్కటి సహకారం అందించాడు. బుమ్రా మినహా బౌలర్లెవరూ ప్రభావం చూపలేకపోగా.. రాయల్స్ అలవోక విజయంతో పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 

సంక్షిప్త స్కోర్లు

ముంబై: 179/9 (తిలక్ 65, నేహల్ 49; సందీప్ 5/18, బౌల్ట్ 2/32), రాజస్థాన్: 18.4 ఓవర్లలో 183/1 (యశస్వి 104 నాటౌట్, శాంసన్ 38 నాటౌట్; చావ్లా 1/33). 

పాయింట్ల పట్టిక 2024

జట్టు మ్యా గె ర.రే పా

రాజస్థాన్ 8 7 1 0.69 14

కోల్‌కతా 7 5 2 1.20 10

హైదరాబాద్ 7 5 2 0.91 10

చెన్నై 7 4 3 0.52 8

లక్నో 7 4 3 0.12 8

గుజరాత్ 8 4 4 8

ముంబై 8 3 5 6

ఢిల్లీ 8 3 5 6

పంజాబ్ 8 2 6 4

బెంగళూరు 8 1 7 2

నోట్: మ్యా గె 

ఓ ర.రే పా