10 August, 2026 | 8:11 PM

మానవతా దృక్పథంతో గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి

10-08-2026 07:09 PM

కుటుంబానికి అండగా నిలిచిన టీజీడబ్ల్యూ డబ్ల్యూసీ

గంభీరావుపేట,(విజయక్రాంతి): ఒమన్‌లోని మస్కట్‌లో మృతి చెందిన గల్ఫ్ కార్మికుడి మృతదేహాన్ని మానవతా దృక్పథంతో స్వగ్రామానికి తరలించి టీజీడబ్ల్యూ డబ్ల్యూసీ మరోసారి తన సేవాభావాన్ని చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన గేరిగంటి శ్రీహరి (45) పదేళ్లుగా ఒమన్‌లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.

జూలై 29న అస్వస్థతకు గురైన శ్రీహరి గుండెపోటుతో మృతి చెందగా, గతంలో పనిచేసిన సంస్థకు సమాచారం ఇవ్వకుండా మరో కంపెనీలో పనిచేయడం వల్ల మృతదేహం స్వదేశానికి తరలింపులో చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యులు టీజీడబ్ల్యూ డబ్ల్యూ సీ మస్కట్ కోఆర్డినేటర్ గోగు దేవరాజును ఆశ్రయించారు.ఈ విషయంపై స్పందించిన దేవరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్‌తో కలిసి భారత రాయబార కార్యాలయం, సంబంధిత అధికారులు, స్పాన్సర్‌తో సమన్వయం చేసుకుంటూ మృతదేహం తరలింపుకు కృషి చేశారు.

అధికారుల సహకారంతో చివరకు శ్రీహరి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో విజయం సాధించారు. అదేవిధంగా తెలంగాణ సచివాలయంలోని ఎన్‌ఆర్‌ఐ విభాగం ద్వారా హైదరాబాద్‌ నుంచి నర్మాల వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కాగా సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య,కొడుకు, కూతురు ఉన్నారు.ఈ సందర్భంగా సహకరించిన ప్రభుత్వం, టీజీడబ్ల్యూ డబ్ల్యూ సీ ప్రతినిధులకు శ్రీహరి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.