30 లక్షలకు నీట్ పేపర్!
పాట్నా, జూన్ 15: నీట్ ప్రశ్నపత్రం లీక్ కాలేదని కేంద్రప్రభుత్వంతోపాటు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పదేపదే చెప్తున్నప్పటికీ లీకేజీ వాస్తవేమన్న ఆరోపణలకు బలం చేకూరుతున్నది. బీహార్‌లో ఒక్కో నీట్ పేపర్‌కు రూ.30 లక్షలు తీసుకొని కొందరు లీక్ చేసినట్టు అక్కడి దర్యాప్తు సంస్థలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. బీహార్‌లో ప్రశ్నపత్రం లీకైనట్టు ఆరోపణలు రావటంతో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేపట్టి 14 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారించింది. ఈ విచారణలో వాళ్లు విస్తుగొలిపే విషయాలు చెప్పారు.
రూ.30 లక్షలు తీసుకొని పేపర్ లీక్‌చేసినట్టు ప్రభుత్వ జూనియర్ ఇంజినీర్ ఒకరు ఒప్పుకొన్నాడు. నీట్ అభ్యర్థుల కుటుంబసభ్యులతోనూ సంబంధాలు కొనసాగించినట్టు తెలిపాడు. మే నాలుగో తేదీనే తమకు నీట్ పశ్రపత్రం అందిందని వెల్లడించారు. ఆ ప్రశ్నపత్రాన్ని రూ.30 నుంచి రూ.32 లక్షల ఒకటి చొప్పున విక్రయించినట్టు తెలిపాడు. పేపర్‌ను 13 మంది విద్యార్థులకు అమ్మినట్టు ఒప్పుకొన్నాడు. వారిలో నలుగురు విద్యార్థులను ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఆరోపణలపై ఎన్టీఏ ఇంకా స్పందించలేదు.






