27-06-2025 01:12:01 AM
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి )/ శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరాభివృద్ధిలో హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నా రు. దేశంలోని ఇతర నగరాలకు రోల్‌మోడల్‌గా నగరాన్ని అభివృద్ధి చేయాలనే సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పానికి ఇది దిక్సూచిగా మారుతుందని స్పష్టం చేశారు
హెచ్- సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.45 కోట్లతో ఎన్‌హెచ్-65 నుంచి అమీన్‌పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులకు గురువారం చందానగర్‌లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాభివృద్ధికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని తెలిపారు.
ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రూ.7,032 కోట్లతో ఫ్లు ఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్డు విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే హెచ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని వివరించారు. ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రహదారి నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం, పర్యావరణహితంగా నగరాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలని స్పష్టం చేశారు.
దీంతో రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో నగరంపై పడుతున్న ఒత్తిడి చాలా వరకు తగ్గు తుందని, నగరవాసులకు సౌకర్యమంతమైన, నాణ్యమైన జీవనశైలి అందుతోం దన్నారు. ఇప్పటికే నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో వేయి ఎలక్ట్రిక్ బస్సులను నడిపేం దుకు ప్రణాళికలు రూపొందించామని, వాటికి అదనంగా మరో 800 బస్సులను తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించారని వెల్లడించారు.
ఇందుకు కేంద్రం సైతం సహకరించేందుకు ముందుకొచ్చిందని, ప్రస్తుతం నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కీలక ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని చెప్పా రు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా నలువైపులకు విస్తరిస్తామని స్పష్టం చేశారు. తమపై కొందరు పనిగట్టుకొని దుష్ర్పచారం చేస్తున్నారని, మంచి చేయాలని సంకల్పిస్తే హెచ్‌సీయూ భూముల విషయంలో వారేం చేశారో మీరంతా గమనించారని గుర్తు చేశా రు.
అభివృద్ధి ఒక్కటే తమ లక్ష్యం, ధ్యేయమ ని స్పష్టం చేశారు. మీకోసం పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, తమకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్ర మంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల, రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.