17 April, 2026 | 10:32 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

విశ్వకర్మ యోజన.. అక్రమ వసూళ్ల భజన!

27-06-2025 02:06 AM
  1. ప్రవేశం పొందాలంటే రూ.600 కట్టాల్సిందే..              
  2. పరీక్షకు, టూల్ కిట్‌కు మరో రూ.1500 అదనం..?              
  3. సూర్యాపేటలోని ఓ శిక్షణ కేంద్రం తీరు                           
  4. బతుకుదెరువు కోసం వస్తే భారంగా మారిందన్న  శిక్షణార్థులు                               

సూర్యాపేట, జూన్ 26 (విజయక్రాంతి) : చేతివృత్తుల వారికి చేయూతనందించి బతుకులకు భరోసా కల్పించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పలు చేతివృత్తుల వారికి ప్రత్యేక శిక్షణలు ఇవ్వడంతో పాటు అందుకు అవసరమైన పరికరాలు ఉచితంగా అందిస్తూ, అతి తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను సైతం అందజేస్తుంది.

దీనిని అందిపుచ్చుకునేందుకు 18_ 65 సంవత్సరాల మధ్య వయసుగల అనేక చేతి వృత్తుల పనివారు శిక్షణా కేంద్రాలకు వెళ్లి అక్కడ వారం రోజుల పాటు శిక్షణ  తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. శిక్షణా కేంద్రాల నిర్వహకుల వక్రబుద్ధి ఫలితంగా ’విశ్వకర్మ యోజన కాస్త అక్రమ వసూళ్ల భజన’ గా మారిపోయింది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.  

 పైసలతోనే ప్రవేశం... :  

విశ్వకర్మ యోజన శిక్షణ పొందాలంటే మొదటగా ఆన్లైన్లో దరఖాస్తు లచేసుకోవాల్సి ఉంటుంది. అగో.. అక్కడే మొదలవుతుంది అసలు కథ. ఆన్లైన్ దరఖాస్తు చేయాలంటే ఒక్కో అభ్యర్థి నుంచి రూ.200_ 300 వరకు తీసుకుంటున్నారు. తదుపరి అభ్యర్థుల వివరాలు శిక్షణ కేంద్రాలకు చేరిన తర్వాత ఆయా కేంద్రాల వారే అభ్యర్థులను శిక్షణకు రమ్మని ఫోన్ చేసి పిలుస్తారు.

సదరు అభ్యర్థి అక్కడికి వచ్చిన తదుపరి ప్రవేశం పొందాలంటే ముందుగా మీరు రూ.600 చెల్లించాలని వారి నుండి అక్రమంగా వసూలు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇవే కాకుండా ఆరు రోజుల శిక్షణ పూర్తి అయిన తదుపరి పరీక్ష రాయడానికి సహకరించినందుకు, టూల్ కిట్ అందేలా చేయాలంటే అదనంగా మరికొంత మొత్తంలో వసూలు చేస్తున్నట్లు శిక్షణార్థుల నుండి వినిపిస్తుంది.                            

సూర్యాపేటలో ఓ శిక్షణా కేంద్రంపై అభియోగాలు..

జిల్లా కేంద్రంలో మొత్తం మూడు విశ్వకర్మ యోజన శిక్షణ కేంద్రాలు ఉండగా.. వీటిలో రెండు నడుస్తున్నాయి. అయితే కొత్త బస్టాండ్ సమీపంలో గల ఓ శిక్షణ కేంద్రంలో ప్రవేశం పొందడానికి రూ.600 అక్రమంగా వసూలు చేస్తున్నట్టు వినికిడి. అదేవిధంగా శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్ష సక్రమంగా రాయడానికి సహకరించేందుకు, టూల్ కిట్టు అందేలా చేసేందుకు మరో రూ.1500 అక్రమంగా వసూలు చేస్తున్నారని అభ్యర్థుల నుండి అభియోగాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే 600 మంది ఈ శిక్షణ పూర్తి చేసుకోగా వారందరి నుండి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఇవి చాలవు అన్నట్టు ఈ శిక్షణలో మొదటి, చివరి రోజులు మాత్రమే హాజరైతే సరిపోతుందంటూ దానికి ఓ రేటు మాట్లాడుకుంటున్నట్టువిశ్వసనీయంగా తెలుస్తుంది. అరకొరా వసతులు మాత్రమే కల్పిస్తూ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న శిక్షణా కేంద్రాలపై అధికారులు తగు చర్యలు తీసుకొని బతుకుదెరువుకు భరోసా కల్పించాలని శిక్షణార్థులు, యువకులు కోరుతున్నారు.