20 March, 2026 | 7:42 AM

హెచ్ ఫాస్ట్ @ కల్తీగాళ్లపై నిఘా

20-03-2026 01:13 AM
  1. హైదరాబాద్ పోలీసుల సరికొత్త విభాగం
  2. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మెరుపు దాడులు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఆహార పదార్థాలను కల్తీ చేసే కేటుగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ సిద్ధమైంది. కల్తీ మాఫియాను అరికట్టడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గురువారం ఈ విభాగాన్ని గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు.

ఆహార కల్తీకి వ్యతిరేకంగా పక్కా సమాచారంతో, పటిష్టమైన యంత్రాంగం ద్వారా క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహించడం ఈ విభాగం యొక్క ప్రధాన లక్ష్యం. హెచ్-ఫాస్ట్ విభాగంలో ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 28 మంది సభ్యులు ఉంటారు. వీరు కేవలం దాడులకే పరిమితం కాకుండా, నగరం నలుమూలల ఉన్న ఆహార తయారీ కేంద్రాలు, హోటళ్లు, గోదాములపై నిరంతరం నిఘా ఉంచుతారు.

ఈ బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఎక్కడ కల్తీ జరుగుతున్నట్లు సమాచారం అందినా తక్షణమే స్పందిస్తుంది. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా 8712661212 అనే టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు.