హజ్ మృతులు వెయ్యి
50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతల నమోదు
1000 మందికిపైగా హజ్ యాత్రికుల మృతి
వీరిలో 90 మంది భారత్‌కు చెందినవారే
మక్కా (సౌదీ అరేబియా), జూన్ 20: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మక్కాలో తీవ్రమైన ఎండలు, వడగాలులతో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హీట్‌స్ట్రోక్‌తో పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు 1000కి పైగా హజ్ యాత్రికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వీరిలో 90 మంది భారతీయులు ఉన్నట్లు ఓ దౌత్యాధికారి వెల్లడించినట్లు తెలిపాయి.
అయితే, ఈ విషయంలో సౌదీ అరేబియా, భారత ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, సౌదీ వైద్యాధికారులు మాత్రం 650 మంది మృతి చెందినట్లు ధ్రువీకరించారు. యాత్రికుల మరణాల మొత్తం సంఖ్యపై ప్రభుత్వపరంగా అధికార ప్రకటన మాత్రం చేయలేదు. జోర్డాన్, టునీసియా వంటి కొన్ని దేశాలు తమ యాత్రికుల మరణాలను ధ్రువీకరిస్తూ ఈ ప్రకటనలు చేశాయి. మృతుల్లో అత్యధికంగా ఈజిప్టుకు చెందిన 320 మంది ఉన్నట్లు సమాచారం. 5 రోజుల హజ్ యాత్రలో భాగంగా ఈ ఏడాది మొత్తం 18.3 లక్షల మంది యాత్రికులు దర్శించుకున్నారు.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..
సౌదీ అరేబియాలో విపరీతమైన ఎండ, వేడిగాలులతో హజ్ యాత్రికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాదాపు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటడంతో యాత్రికులు వేడికి తాళలేకపోతున్నారు. వడదెబ్బ సోకి వందల మంది చనిపోగా మృతదేహాల కోసం విజ్ఞప్తులు వెల్లువెత్తున్నట్లు సౌదీ అధికారులు బుధవారం వెల్లడించారు. కాగా, బుధవారం మక్కాలోని మెడికల్ కాంప్లెక్స్ వద్ద కొంత మంది మృతుల వివరాలు ప్రకటించారు.






