16 July, 2026 | 9:42 AM

కల్తీ మద్యానికి 39 మంది బలి

21-06-2024 01:34 AM

తమిళనాడులో పెరిగిన మృతుల సంఖ్య

ఘటనకు కారణమైన నలుగురి అరెస్టు

జిల్లా కలెక్టర్, ఎస్పీపై ప్రభుత్వం చర్యలు

చెన్నై, జూన్ 20: తమిళనాడు కల్లుకురిచిలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 38కి చేరింది. మరో 100 మందికి పైగా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కరుణాపురంలో చాలామంది రోజువారీ కూలీలు జూన్ 18న ప్యాకెట్లలో అమ్మే కల్తీ మద్యాన్ని తాగినట్లు అధికారులు వెల్లడించారు. ఆ రోజు రాత్రి వీరిలో చాలామందికి డయేరియా, వాంతులు, కడుపు నొప్పి, కళ్లలో మంటలు వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు. 

సీఎం సీరియస్.. 

కల్తీ మద్యం తాగి మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరణాలు సంభవించడంతో సీరియస్ అయిన స్టాలిన్.. సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. మిథనాల్ కలిపిన సారా తాగడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనకు కారణమైన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో విఫలమైన అధికారులపైనా చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్ శ్రవణ్‌కుమార్ బదిలీ కాగా, ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు పడింది. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.