డార్క్ వెబ్‌లో యూజీసీ నెట్ పేపర్!
పరీక్ష రద్దుపై అనుమానాలు
నీట్ అపవాదు నుంచి బయటపడేందుకేనా?
న్యూఢిల్లీ, జూన్ 20: నీట్ పరీక్ష పేపర్ రద్దు అంశం ఎన్టీఏను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. అంతలోనే యూజీసీ నెట్ పేపర్ కూడా లీకైనట్టు అనుమానాలు రావటంతో ఆ సంస్థ నెత్తిన పిడుగు పడ్డట్టయ్యింది. ఆ పేపర్ డార్క్‌వెబ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ కాలేదని ఎన్టీఏ ఇప్పటికీ వాదిస్తున్నప్పటికీ.. లీకైనట్టు స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఈ సమయంలో నెట్ పేపర్ కూడా లీకైందని ఫిర్యాదులు వస్తే పరువు మొత్తం గంగలో కలుస్తుందని భయపడిన ఆ సంస్థ.. పరీక్ష నిర్వహించిన తెల్లారే దానిని రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. అందుకు నేషనల్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ సిఫారసులను ఆధారంగా చూపిస్తున్నది.
వరుసగా రెండు జాతీయ పరీక్షల పేపర్ల లీకేజీతో ఎన్టీఏపై ముప్పేట దాడి జరుగుతున్నది. విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. నీట్‌ను కూడా పూర్తిగా రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. గురువారం విద్యార్థి సంఘాల నేతలు కేంద్ర విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని కలిసి వినతిపత్రం అందించారు. ఇండియా కూటమి నేతలు కేంద్రంపై ముప్పేట దాడి మొదలుపెట్టారు. వరుసగా పేపర్ల లేకేజీకి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘ప్రధాని మోదీ మన్ కీ బాత్ చెప్తుంటారు. కానీ, యువత మన్ కీ బాత్ మాత్రం ఆయన వినరు’ అని ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ విమర్శించారు. పేపర్ల లీకేజీపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.






