calender_icon.png 13 September, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమ్దానిలో సగం ఆవిరే!

16-12-2024 01:32:14 AM

  1. సొంత రాబడులు పెరిగినా 48శాతం అసలు, మిత్తికే
  2. బీఆర్‌ఎస్ హయాంలో బడ్జెట్ మూడింతలు పెరిగితే  
  3. అప్పు తొమ్మిదింతలు వృద్ధి
  4. 2014లో రాష్ట్ర అప్పు రూ.72 వేలకోట్లు
  5. 2023 నాటికి రూ.6,71,757 కోట్లు
  6. ఎఫ్‌ఆర్‌బీఎం అప్పులు రూ.3.89 లక్షల కోట్లు
  7. 450 శాతం పెరిగిన వడ్డీ
  8. ఆర్‌బీఐ 2023-24 నివేదిక వెల్లడి 

హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వానికి 2014-23 మధ్య కాలంలో ఆదాయం భారీగా పెరిగింది. సొంత రాబడుల్లో తెలంగాణ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూ రూ.29,288కోట్లు ఉంటే.. 2023-24 నాటికి రూ.1,31,029 కోట్లకు పెరిగినట్టు తాజాగా ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెరిగిందో అప్పులు కూడా అదే స్థాయిలో పెరగడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సొంత రాబడులు రూ.1,10,592కోట్లు రాగా.. ఇదే ఏడాదిలో అప్పులు, వడ్డీ కింద ఏకంగా రూ.53,978 కోట్లు చెల్లించినట్టు నివేదిక తెలిపింది. అంటే వచ్చిన ఆదాయంలో 48శాతం కిస్తీలకే పోయింది. 

450 శాతం పెరిగిన వడ్డీ.. 

బీఆర్‌ఎస్ హయాంలో 11 బడ్జెట్‌ల(ఒకటి మధ్యంతర)ను ప్రవేశపెట్టారు. 2014-15లో తెలంగాణ బడ్జెట్ రూ.1,00,637.96 కోట్లు ఉంటే.. 2023-24 నాటికి రూ. 2,90,396 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో బడ్జెట్ విలువ దాదాపు మూడింతలు పెరిగింది. కానీ అప్పులు ఏకంగా బడ్జెట్, బడ్జెటేతర రు ణాలతో కలిపి తొమ్మిదింతలు పెరిగాయి.

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రానికి రూ.72 వేలకోట్ల అప్పు ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి అవి రూ.6,71,757 కోట్లకు చేరింది. అంటే తొమ్మిదింతలు పెరిగింది. ఈ అప్పులకు చెల్లించే వడ్డీలు ఏటా భారీగా పెరుగుతున్నాయి. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. ఎఫ్‌ఆర్‌బీ ఎం రుణాలకు 2014- 15లో రూ.5,227 కోట్లు వడ్డీలకు చెల్లిస్తే.. 2023-24 నాటికి ఏకంగా రూ.22,408కోట్లకు పెరిగాయి.

అంటే దాదాపు 450శాతం వడ్డీ పెరిగింది. 2023-24 నాటికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌కు లోబడి తీసుకున్న రుణా లు రూ.3,89,673 కోట్లుగా ఉన్నాయని ఆర్‌బీఐ చెప్పింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతేడాది డిసెంబర్‌లో విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలిపింది.

కాళేశ్వరానికే రూ.7 వేలకోట్లకుపైగా చెల్లింపులు

గత సర్కారు తొమ్మిదిన్నరేళ్లలో ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి బడ్జెట్, బడ్జెటేతర రుణాలు భారీగా చేసింది. దేశంలోని ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయడం సహజమే కానీ.. ఆ అప్పులకు ఒక ప్రణాళిక అవసరం. అయితే గత సర్కారు ప్రణాళిక లేకుండా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసిందంటూ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోపిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టే ఇందుకు నిదర్శనమని సర్కారు చెబుతోంది. ఆర్‌బీఐ గణాంకాలను, కాం గ్రెస్ సర్కారు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంతో పో ల్చి చూస్తే.. అది వాస్తవమేనన్న అభిప్రా యం కలుగుతోంది. నాటి ప్రభు త్వం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ గ్యారెంటీ మీద రూ.79,287 కోట్ల అప్పు తీసుకుంది.

ప్రిన్సిపల్ అమౌంట్, మిత్తీ కట్టగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఈ ఒక్క ప్రాజెక్టు మీద తీసుకొచ్చిన అప్పు రూ.74,590కోట్లు మిగి లి ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి గా ఆగిపోగా.. చుక్క నీరు కూడా పార డం లేదు. అయితే ఈ ప్రాజెక్టు మీద తెచ్చుకున్న అప్పునకు 9.69శాతం వడ్డీతో రూ.7వేల కోట్లకు పైగా అస లు, మిత్తీని ప్రభుత్వం నెలనెలా చెల్లిస్తోంది. 

హెచ్చరికతో ఆగిన అప్పులు.. 

గత సర్కారు ఒకవైపు బడ్జెట్ రుణాలను తీసుకుంటూనే, మరోవైపు కార్పొరేషన్లు, గ్యారెంటీల ద్వారా బడ్జెటేతర రుణాలను భారీగా తీసుకునేది. ఒక దశలో ఇవి తారాస్థాయికి చేరాయి. 2022 నాటికి ప్రభుత్వం రూ.1,35,282.5 కోట్ల బడ్జెటేతర రుణాలు తీసుకున్నట్టు ఆర్‌బీఐ నివేదిక తెలిపింది.

ఆ ఏడాది నాటికి అత్యధిక రుణాలను తీసుకున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ ఉంది. బడ్జెటేతర రుణాలు అంటే వేరే కాదని.. అవి కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వస్తాయని కేంద్రం చెప్పడంతో మరుసటి ఏడాది నుంచి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తీసుకోవాడాన్ని నాటి ప్రభుత్వం తగ్గించుకున్నట్టు ఆర్‌బీఐ నివేదిక చెబుతోంది.