02-07-2025 12:56:02 AM
- ఆర్‌అండ్‌బీ పనుల్లో వేగం పెంచాలి
- ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): హ్యామ్ రోడ్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎర్రమంజిల్ లోని ఆర్‌అండ్‌బీ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని అన్ని రకాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో పురోగతి పెంచేందుకు ఖచ్చితంగా చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి ఫీల్డ్ విజిట్ చేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.
శాఖపై ఎప్పటి కప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటానని, ప్రతి రివ్యూకు పనుల పురోగతి చూపించాలన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ మన రాష్ర్ట వాటా రూ. 300 కోట్ల సీఆర్‌ఐఎఫ్ ఫండ్ వచ్చేలా కృషి చేశానని తెలిపారు. బిల్స్ క్లియర్ అవుతుంటే అదేస్థాయిలో పనులు కూడా వేగంగా జరగాలని, అన్ని రకాల పనుల్లో ప్రోగ్రెస్ చూపించాలన్నారు. హ్యామ్ రోడ్లు పది ప్యాకేజీలు మొదలు చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఈఎన్‌సీ జయభారతిని ఆదేశించారు. మళ్లీ దీనిపై రివ్యూ చేస్తాన్నారు.
రోడ్ యాక్సిడెంట్స్ నిర్మూలించేందుకు బ్లాక్ స్పాట్స్, వర్టికల్ కర్వ్స్ ముందే ఐడెంటిఫై చేయాలని సూచించారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఆర్‌అండ్‌బీ రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు భూ సేకరణ సమస్య కూడా లేకుండా ఇప్పటికే ప్రభు త్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. హ్యామ్ రోడ్ల డీపీఆర్, టెండర్ ప్రాసెస్‌పై రెండు రోజుల్లో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తానని మంత్రి స్పష్టం చేశారు. చివరి దశలో, పెండింగులో ఉన్న ఆర్వోబీలు, మెడికల్ కాలేజీలు, టిమ్స్ హాస్పిటల్స్, కలెక్టరేట్లు వెంటనే పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.