02-07-2025 11:13:41 AM
హైదరాబాద్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం(Medaram) గ్రామంలో 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర (Medaram Jatara) షెడ్యూల్‌ను అర్చక సంఘం అధికారికంగా ప్రకటించింది. ఆనవాయితీలో భాగంగా జనవరి 28న చిలకలగుట్ట నుంచి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెకు చేరుకుంటారని, జనవరి 29న సమ్మక్క తల్లి రాకతో జనవరి 30న భక్తులు తలనీలాలు సమర్పించి 31న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
ఈ కార్యక్రమం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుందని, గిరిజన వర్గాల గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు. మేడారంలో జరిగే ఈ జాతరకు(Medaram Maha Jatara) భారతదేశం అంతటా లక్షలాది మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పటి నుండి, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, తదితర పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. లక్షలాది మంది భక్తులు బెల్లాన్ని 'బంగారం'గా పూజించి దేవతకు సమర్పిస్తారు. మేడారం మహా జాతర వచ్చే భక్తులకు వసతి కల్పించడానికి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.