2 April, 2026 | 2:58 AM

నేడు హనుమాన్ శోభాయాత్ర

02-04-2026 01:06 AM
  1. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
  2. భద్రతా చర్యలు చేపట్టిన పోలీస్ యంత్రాంగం

హైదరాబాద్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): హనుమాన్ జయంతి పురస్కరించుకొని బుధవారం నగరంలో భారీ ఎత్తున శోభాయాత్రలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఊరేగింపులు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అలాగే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు.

హనుమాన్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సుమారు 3 వేల మంది పోలీసులతో గట్టి నిఘా ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కాగా హనుమాన్ శోభాయాత్రం బుధవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. ఈ శోభాయాత్ర లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉండడంతో నగరంలోని అనే మార్గాల్లో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా మళ్లించ డం జరుగుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 

శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిరం నుం చి పారడైజ్ జంక్షన్ వరకు, అలాగే కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి డీఎంహెచ్‌ఎస్ కోఠి వరకు కొనసాగనుంది. ఈ మార్గాల్లో పుత్లిబౌలి, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఆశోక్‌నగర్, గాంధీనగర్, కవాడిగూడ, సీజీవో టవర్స్, రాణిగంజ్, పాట్నీ, పారడైజ్ వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగనుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు శోభాయాత్ర చేరుకునే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడం లేదా, ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నారు. ఆబిడ్స్, బ్యాంక్‌స్ట్రీట్, ఎంజే మార్కెట్, కాచిగూడ, సుల్తాన్‌బజార్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కఠినంగా అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

లక్డీకాపూల్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ లేదా ఓల్డ్ సిటీ వైపు వెళ్లేవారు బషీర్‌బాగ్-హిమాయత్‌నగర్-నారాయణగూడ ఫ్లుఓవర్- బర్కత్‌పుర- నిబో లిఅడ్డా- చాదర్‌ఘాట్ మార్గాన్ని వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.