3 September, 2026 | 5:22 AM

ఇవేం పనులు సార్?

03-09-2026 | 03:25am

అస్తవ్యస్తంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు 

కేసముద్రం, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్తు స్తంబాల(Electricity Poles) ఏర్పాటులో ఏక రీతిన చేయకుండా అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కేసముద్రం పట్టణంలో ప్రధాన రహదారులను 80 అడుగులకు విస్తరించడానికి నిర్ణయించారు.

అయితే కొన్నిచోట్ల గృహ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రజల నుండి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో కేసముద్రం (వి) నుండి అంబేద్కర్ సెంటర్ వరకు 74 అడుగులకు తగ్గించారు. మధ్యలో డివైడర్ తో కలిపి రోడ్డు నిర్మాణానికి 66 అడుగులు కేటాయించగా, ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణానికి 4 అడుగుల చొప్పున 8 అడుగులు కేటాయించారు. డ్రైనేజీకి ఈవలి వైపు అనగా రోడ్డు వైపు డ్రైనేజీ గోడ ఆనుకొని విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు విద్యుత్తు శాఖకు సూచించారు.

అయితే కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు పనులు చేపట్టిన గుత్తేదారు విద్యుత్ స్తంభాలను ఆర్ అండ్ బి శాఖ అధికారులు సూచించిన మేరకు వేయకుండా, ఇష్టానుసారంగా వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల సైడ్ డ్రైనేజీ మధ్యలో, ఇంకొన్ని చోట్ల కాల్వకు ఇవతల వైపుకు రోడ్డుకు అడ్డుగా, మరి కొన్నిచోట్ల అధికారులు సూచించిన విధంగా వేస్తున్నారని, దీనితో విద్యుత్ స్తంభాల ఏర్పాటు సక్రమంగా లేక అనేకచోట్ల అడ్డదిడ్డంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లక్షల రూపాయలు వెచ్చించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భారీ వాహనాలు వెళితే విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా 11 మీటర్ల ఎత్తు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయతలపెట్టారు. పెద్ద ఎత్తున ఖర్చుపెట్టి ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాలను అనేక చోట్ల ఆర్ అండ్ బి అధికారులు నిర్దేశించిన విధంగా కాకుండా సక్ర మంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల కొన్నిచోట్ల ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇలా ఒక్కోచోట ఒక్కో విధంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం సరైంది కాదని చెబుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన విద్యుత్తు లైన్ల ఏర్పాటు అంశంపై చర్యలు తీసుకొని విద్యుత్ స్తంభాలను ఒకే కొలతల ప్రకారం ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

విద్యుత్ స్తంభాలను సరి చేయిస్తాం

కేసముద్రం పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాలను తాము సూచించిన విధంగా, కొన్నిచోట్ల సరిగా వేయడం లేదని ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. నూతనంగా నిర్మిస్తున్న సైడ్ డ్రెయిన్ రోడ్డు వైపు గోడకు ఆనుకొని విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఎక్కడైనా సైడ్ డ్రైన్ లో, లేదంటే వెలుపలికి వచ్చే విధంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తే వాటిని తిరిగి తొలగించి, నిర్ణీత కొలతల ప్రకారం ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. అలా సరిచేసిన తర్వాతనే సంబంధిత పనులకు గుత్తేదారుకు బిల్లు చెల్లించే విధంగా ఆదేశాలిస్తాం. రోడ్డు విస్తరణలో ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తే వాటిని తిరిగి సక్రమంగా చేయించే విధంగా చర్యలు తీసుకుంటాం. 

శ్రీకాంత్, డీఈఈ, ఆర్ అండ్ బీ, మహబూబాబాద్.