18 July, 2026 | 8:02 AM

హ్యపీ బర్త్ డే

30-11-2024 12:00 AM

నేడు వెన్నెలకంటి జయంతి. ఇంటిపేరు ‘వెన్నెలకంటి’తో చిత్రసీమకు సుపరిచితుడైన ఈ ప్రసిద్ధ పాటల రచయిత పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. 1957 నవంబర్ 30న నెల్లూరులో పుట్టిన ఆయన బాల్యం నుంచే హరికథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినేందుకు ఇష్టపడేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలు రాశారు. 1986లో నటుడు, నిర్మాత డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి ప్రోద్బలంతో ‘శ్రీరామచంద్రుడు’ సినిమాలో ‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల’ అనే పాటతో వెండితెరకు గీత రచయితగా పరిచయమయ్యారు.

తర్వాత 1987లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో ‘అన్నాచెల్లెలు’ చిత్రంలో ‘అందాలు ఆవురావురన్నాయి’ అనే పాట రాశారు. ‘నాయకుడు’ సినిమాతో అనువాదంలోకి ప్రవేశించిన ఆయన ‘ప్రేమాగ్ని’ సినిమాకు తెలుగులో మాటలు రాశారు. కమల్ హాసన్ నటించిన ‘సత్యభామ’ సినిమాకు డబ్బింగ్ రాశారు. సుమారు 2000 పాటలు రాశారు. 2021, జనవరి 5న కాలం చేశారు.  

నేడు రాశీ ఖన్నా పుట్టిన రోజు. 1990, నవంబర్ 30న జన్మించిన ఖన్నా ఆదివారం 34వ పడిలోకి అడుగు పెడుతోంది. ఢిల్లీ వాస్తవ్యురాలైన ఆమె 2013లో వచ్చిన హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’లో ఓ సహాయ పాత్రతో తన నటనను ప్రారంభించింది. టాలీవుడ్‌లో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ‘ఊహలు గుసగుసలాడే’ (2014) సినిమాకు తొలి సంతకం చేసినా, అంతకు ముందే ‘మనం’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో తెలుగు తెరపై మెరిసింది రాశీ ఖన్నా. తెలుగులో బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతిరోజు వంటి విజయవంతమైన కమర్షియల్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తమిళంలో ‘ఇమైక్కా నోడిగల్’ (2018)లో మొదటిసారి నటించిన ఆమె ‘తిరుచిత్రంబలం’, ‘సర్దార్’, ‘అరణ్మనై’ వంటి సినిమాలతో ప్రముఖ నటిగా స్థిరపడింది. మలయాళ సినిమా ‘విలన్’ (2017)లో నటించింది. వివిధ భాషల్లో  కొన్ని పాటలు కూడా పాడింది.