15 August, 2026 | 1:47 AM

గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా హర్ ఘర్ తిరంగా

15-08-2026 12:51 AM

గజ్వేల్, ఆగష్టు 14: దేశభక్తి, జాతీయ సమైక్యత, జాతీయ జెండాపై గౌరవభావాన్ని విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లుI, II ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ‘హర్ ఘర్ తిరంగానా తిరంగా, నా గర్వం’ అనే అంశంపై పోస్టర్ మేకింగ్ నిర్వహించారు.

కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను మాత్రమే ఉపయోగించి విద్యార్థినులు రూపొందించిన చిత్రాలను కళాశాలలో ప్రదర్శించారు. అలాగే ‘సెల్ఫీ విత్ తిరంగా’ కార్యక్రమంలో విద్యార్థినులు, అధ్యాపకులు జాతీయ జెండాతో ఫొటోలు తీసుకుని, క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేసి సర్టిఫికెట్లు పొందారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. పి. సౌజన్య, డా. కె. సరోజ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కేవలం జెండా ఎగురవేయడం మాత్రమే కాకుండా దేశం పట్ల బాధ్యత, ఐక్యత, గర్వభావాన్ని చాటే కార్యక్రమమని తెలిపారు.

విద్యార్థినులు తమ కుటుంబాలు, సమాజంలోనూ ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు