సమృద్ధిగానే వర్షాలు
తెలంగాణలో సమయానికే రుతుపవనాలు
కేంద్ర భూవిజ్ఞాన శాఖ వెల్లడి
తెలంగాణలో రెండురోజుల్లో వర్షాలు
పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ
న్యూఢిల్లీ, హైదరాబాద్, మే 15 ( విజయక్రాంతి): దేశంలో చాలా రాష్ట్రాల్లో కరువు తాండవిస్తున్న వేళ కేంద్రప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. దేశంలో ఈసారి వర్షాకాలంలో సాధారణంకంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని కేంద్ర భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ వెల్లడించారు. దీర్ఘకాలిక సగటు వర్షపాతం 106 శాతం ఉండవచ్చని ఓ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఏటా నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళ మీదుగా భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి. దేశమంతా విస్తరించి సెప్టెంబర్ మధ్యలో నిష్క్రమిస్తాయి.
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా ప్రకారం ఏటా సాధారణ వర్షపాతం అంటే 96 నుంచి 104 శాతం మధ్య వర్షాలు కురువటం. నైరుతి రుతుపవన 50 ఏండ్ల సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు (35 ఇంచులు). దేశంలో ఎల్‌నినో ప్రభావం తగ్గిపోయి క్రమంగా లానినా పరిస్థితులు పెరుగుతున్నాయని, దీనివల్ల వర్షాకాలంలో సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నా యని రవిచంద్రన్ తెలిపారు.
అయితే, దేశంలోని వాయువ్య, పశ్చిమ, ఈశాన్య ప్రాంతా ల్లోని కొన్నిచోట్ల సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే నాటికి ఎల్‌నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఆగస్టు నాటికి దేశంలో లానినా ప్రభావం పూర్తిగా కనపడుతుందని వెల్లడించారు.
సమయానికే నైరుతి
తెలంగాణలో ఈసారి నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమాయానికే విస్తరించే అవకాశం ఉన్నదని ఐఎండీ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతం, అండమాన్, నికోబార్ దీవులను తాకుతాయని, జూన్ 1న కేరళ తీరాన్ని చేరుతాయని వెల్లడించింది. జూన్ 6 నాటికి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తాయని పేర్కొన్నది. కాగా, నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేవరకు అనేక ప్రాంతాల్లో గాలిదుమారంతో కూడి భరీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
ఇటీవలే భారీ గాలిదుమారం, వర్షానికి పెద్ద హోర్డింగ్ కూలి 16 మంది మరణించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని అకాల వర్షాలకు దాదాపు 15 మంది వరకు మరణించారు. పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.
తెలంగాణలో ఎల్లో అలర్ట్
రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ జిల్లా, కరీంనగర్, జనగాం,యాదాద్రి నల్లగొండ, వనపర్తి తదితర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సిద్దిపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సిద్దిపేట, హనుమకొండ, జోగుళాంబ, నాగర్ కర్నూల్‌లోని పలుప్రాంతాల్లో 15.6 నుంచి 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. ఇక, నిజామాబాద్‌లోని రుద్రూర్‌లో బుధవారం 62 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని జైనాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలోని మల్చెల్మలో 19.8 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది.




