01-12-2025 06:33:10 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంటే ఎస్ఈసీ ఏం చేస్తోందని, శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు, రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడవా..? అని ప్రశ్నించారు. ఎస్ఈసీ సమీక్షించి సీఎంపై కేసు నమోదు చేయాలని, విద్యుత్ శాఖను మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారులతో నింపుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కీలకమైన బాధ్యతల్లో ఆంధ్ర అధికారులను నియమించారని, ప్రభుత్వాన్ని తెలంగాణ వారు నడుపుతున్నారా.. వెనకుండి ఏపీ వాళ్లు నడుపుతున్నారా..? అని ఆయన అడిగారు.
తక్కువ ధరకే ఎన్డీపీసీ విద్యుత్ ఇస్తుంటే.. కొత్త ప్లాంటు ఎందుకు?, కమిషన్ల కోసమే కొత్త పవర్ ప్లాంట్లు చేపడుతున్నారని హరీశ్ రావు తెలిపారు. చర్చ పెడితే ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమని, కొత్తగా చేపట్టే మూడు ప్లాంట్లకు రూ.45 వేల కోట్లు అవుతూందన్నారు. పైసా ఖర్చు లేకుండా ఎన్టీపీసీ విద్యుత్ ఇస్తుంటే.. ఇన్ని వేల కోట్లు ఎందుకు.?, ఏపీ అధికారులు, అవినీతితో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం అవుతుందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.