02-12-2025 12:43:17 AM
-ప్రజలపైకాంగ్రెస్ ప్రభుత్వం రూ.82 వేల కోట్ల భారం
-భట్టీ.. నోరు అదుపులో పెట్టుకో!
-మీలాగా 30 శాతం కమీషన్లు తీసుకోకనే నేను అన్‌ఫిట్
-మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి) : ఎన్టీపీసీ యూనిట్ కరెంట్‌ను రూ. 4.12 కే ఇస్తున్నా.. కమీషన్ల కక్కుర్తితో కాం గ్రెస్ ప్రభుత్వం ప్రజలపై రూ.82 వేల కోట్ల భారం మోపుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కడుతున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక రూ.50 వేల కోట్ల స్కాం ఉందని బీఆర్‌ఎస్ బయటపెట్టిందన్నారు.
సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ స్థాయిని దించుకొని, అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని తనను విమర్శించారని, ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు వారిలాగా 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకోవ డం రాలేదన్నారు.
అందుకే అందులో తాను అన్ ఫిట్ అని ఎద్దేవా చేశారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ చరిత్రలోనే ఏ రోజు కూడా సెక్ర టేరియట్ లోపలికి వచ్చి ఆర్థిక శాఖ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన ట్టు లేదని గుర్తు చేశారు. ఫ్రస్ట్రేషన్‌లో నోరు జారితే మొదటికే మోసం వస్తుందని, సమాధానం ఉంటే, తెలిస్తే చెప్పండి.. లేదంటే మౌనంగా ఉండాలన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంటును రైతులకు, గృహాలకు, పరిశ్రమలకు, పట్టణాలకు, పల్లెలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. పవర్ హాలిడే ఇచ్చిన కాంగ్రెస్ అన్ ఫిటా? లేదంటే నాణ్యమైన కరెంటు ఇచ్చిన బీఆర్‌ఎస్ అన్ ఫిటా అని ప్రశ్నించారు.
తాము స్కాం గురిం చి మాట్లాడుతుంటే, దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నా రు. రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ పెరుగుతుంది అన్న సంగతి మూడో తరగతి పిల్లాడిని అడిగినా చెప్తాడు, ఇందులో మంత్రులు చెప్పాల్సింది ఏముందని ఎద్దేవా చేశారు. రామగుండం, మక్తల్, పాల్వంచలో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు కడతామని క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు చెప్పారని, తాము ప్రశ్నించేసరికి మక్తల్‌లో పెట్టడం లేదు అని రెండు రోజుల్లోనే మాట మార్చారని స్పష్టం చేశారు.
‘ఇంకా టెండర్లు పిలువలేదు. పనులే మొదలు కాలేదు. రూ. 50 వేల కోట్ల అవినీతి అని ఎలా అంటారని భట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు. మరి కాళేశ్వరంలో రూ.84 వేల కోట్ల ఖర్చు కాకముందే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఇదే మం త్రులు, నాయకులు మమ్మల్ని ఎలా తప్పుపట్టారు. ఆ విధంగా అడ్డగోలుగా మాట్లాడినం దుకు ముందు మీరు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. థర్మల్ విద్యుత్ ప్రా జెక్టుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న తప్పుతో, రాష్ర్ట ప్రజలు మరో 25 సంవత్సరాల వరకు ఆర్థిక భారాన్ని మో యాల్సి ఉంటుందన్నారు.
కమీషన్ల కోసమే కదా...
రాష్ర్ట విభజన చట్టంలో భాగంగా ఆనా డు తెలంగాణకు 4 వేల మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని హరీశ్‌రావు తెలిపారు. దాని ప్రకారం ఎన్టీపీసీ 4వేల మెగా వాట్ల ప్లాంట్ నిర్మించిందన్నారు. ఎన్టీపీసీ సీఎండీ వచ్చి ‘తెలంగాణ కోసమే ప్లాంట్ నిర్మించాం. 2400 మెగావాట్ల కరెంటును మీరు తీసుకోండి’ అని సీఎం, డిప్యూటీ సీఎంలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ 2400 మెగావాట్లలో 800 మెగావాట్లు చాలంటున్నారని చెప్పారని అన్నారు. విద్యుత్ రంగంపై పెట్టిన శ్వేతపత్రంలో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 60 ఉండగా, 2026 నాటికి 40 శాతానికి తగ్గిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం థర్మల్ ప్లాంట్లను నిర్మించడానికి రెడీ అవుతుందని విమర్శించారు.
జెన్‌కో డీపీఆర్ ప్రకారం రామగుండం పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.10,800 కోట్లు ఖర్చు అవుతుం దని, ఆ ప్లాంట్‌లో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రూ.7.70 పైసలు అవుతుందని జెన్‌కో డీపీఆర్ స్పష్టం చేసిన విషయం నిజమా కాదా అని ప్రశ్నించారు. నిర్మాణానికి రూ.15వేల కోట్లు అవుతుంటే.. ఇందులో 25శాతం జెన్‌కో/రాష్ర్ట ప్రభుత్వం డబ్బులు పెట్టాలని, 75 శాతం అప్పులు తేవాల్సి ఉందని, ఈ క్రమంలో మూడు పవర్ ప్లాంట్లకి రూ.45 వేల కోట్లు కావాలని అంచనా వేశారు. సంవత్సరానికి 3,285 కోట్లు, పవర్‌ప్లాంట్ల అగ్రిమెంటు 25 సంవత్సరాలు అంటే.. రూ. 82వేలకోట్ల అదనపు భారం ఈ రాష్ర్ట ప్రజల మీద పడుతుందని స్పష్టం చేశారు.
మీ 30 శాతం, 40 శాతం కమీషన్ల కోసం ఈ రాష్ర్ట ప్రజల మీద ఎందుకు భారం వేస్తారని నిలదీశారు. పెన్షన్లకు దిక్కులేదని, కళ్యా ణలక్ష్మికి తులం బంగారం లేదని, మరి ఈ ప్లాంట్లు కట్టడానికి అప్పులు ఎక్కడి నుంచి తెస్తారు.. మిత్తీలు ఎలా కడతారని ప్రశ్నించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే ఫ్లు యాష్ చాలా పెద్ద సమస్య అని, దానివల్ల చాలా ముప్పు ఉంటుందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను మూసే స్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగిరెగిరిపడ్డారని, ఇప్పుడేమో కొత్త పవర్ ప్లాంట్ కు చప్పట్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
మెగావాట్‌కు రూ. 20 లక్షల లంచం
గ్రీన్ ఎనర్జీ పాలసీలో పారిశ్రామికవేత్తలకు ఎక్కడి నుంచైనా గ్రీన్ ఎనర్జీ తీసుకొని వాడుకోవచ్చని అప్లికేషన్లు తీసుకున్నారని హరీశ్‌రావు తెలిపారు. వారు రూ.25 వేలు కట్టి అప్లికేషన్ తీసుకోగా.. అప్లికేషన్ల మీద రూ.600 కోట్లు వచ్చాయని తెలిపారు. కానీ ఈ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో మెగావాట్‌కు రూ.20లక్షల లంచం అడుగుతున్నట్టు.. పైన కూడా ఇవ్వాలి, ఇంకో పది లక్షలు కలిపి 30 లక్షలు ఇవ్వమంటున్నారని ఆరోపించారు.
ఎన్నికల సంఘం నిద్ర పోతుందా?
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి పర్యటనలు చేస్తున్నారని, మరి రాష్ర్ట ఎన్నికల సంఘం నిద్ర పోతుందా అని మాజీ మంత్రి హరీశ్ ప్రశ్నించారు. నియమ నిబంధనలు చూసే బాధ్యత ఎన్నికల సంఘానికి లేదా అని నిలదీశారు. తక్షణమే ఎన్నికల సంఘం రివ్యూ చేసి, పోలీసులకు ఆదేశాలిచ్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట ఎన్నికల సంఘం చట్ట పరంగా వ్యవహరించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఙప్తి చేశారు.
విద్యుత్ శాఖలో ఆంధ్రోళ్ల పెత్తనం
విద్యుత్ శాఖను ఆంధ్ర అధికారులతో నింపిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ విభాగంలో అత్యంత కీలకమైన పోస్టుల్లో ఆంధ్ర అధికారులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్న అనుమానం కలుగుతోందన్నారు.
ఎంతోమంది అనుభవం ఉన్న తెలంగాణ బిడ్డలు ఉండగా.. హైడల్, థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాల్సి ఉన్నప్పటికీ సింగరేణిలో పనిచేసిన రాజశేఖర్ రెడ్డి అనే ఆంధ్ర వ్యక్తిని తెలంగాణ జెన్కో ప్రాజెక్టు డైరెక్టర్‌గా అపాయింట్ చేశారని విమర్శించారు. ఇది తెలంగాణ విద్యుత్ ఇంజ నీర్లను, ఉద్యోగులను అవమానించినట్టే అన్నారు.
ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులను అవహే ళన చేసిన పచ్చి సమైక్యవాది కుమార్ రాజాను తీసుకొచ్చి విద్యుత్ ఉద్యోగుల డైరెక్టర్‌గా జెన్‌కోలో పెట్టారని, ఇది ఉద్యమకారులను, ఉద్యోగులను అవమాన పరిచినట్లు కాదా? అని ప్రశ్నించారు. ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన ‘రైఫిల్ రెడ్డి’ రేవంత్‌రెడ్డి.. ఆయన గురువు చంద్రబాబు తెలంగాణ ద్రోహి, అందుకే నియామకాలన్నీ తెలంగాణ ద్రోహుల పాలవుతున్నాయని చెప్పారు. చీఫ్ ఇంజనీర్లుగా రిటైర్డ్ అయిన తెలంగాణ దళిత బిడ్డలు, అనుభవం ఉన్న అధికారులు ఉంటే.. వాళ్లందర్నీ పక్కనపెట్టిందన్నారు.
ఏనాడు తెలంగాణ గడ్డమీద పనిచేయని, ఇక్కడి విద్యుత్ వ్యవస్థ మీద అవగాహన లేని నరసింహులును ఆంధ్రా నుంచి తీసుకొచ్చి ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్‌పోస్టులో పెట్టారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని లేదా అనుభవం ఉన్న టెక్నోక్రాట్‌ని రెడ్కో సీఎండీగా నియమిస్తే ప్రస్తుతం ఆంధ్రాకు చెందిన జూనియర్ మోస్ట్ అధికారి, డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేసిన వావిలాల అనిలను సీఎండీగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న, గతంలో ఏసీబీ కేసుల్లో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన నందకుమార్‌ను చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పదవిలో నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు.