27-09-2025 10:58:00 AM
హైదరాబాద్: కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరి, ఆవరణ మూడు అడుగుల ఎత్తులో మునిగిపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు(Harish Rao) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ(Telangana government) యంత్రాంగం నిర్లక్ష్యమని విమర్శించారు. నెల రోజులకు పైగా ఆసుపత్రి డ్రెయిన్ దెబ్బతింటుందని, దీనివల్ల మురికి నీరు ఆవరణలోకి ప్రవహిస్తుందని హరీష్ రావు ఆరోపించారు. వర్షం పడుతున్న ప్రతీసారి పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వంలో కనీసం స్పందన ద్వజమెత్తారు. ప్రజల నుండి పదే పదే ఫిర్యాదులు వచ్చినప్పటికీ, అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.. వెంటనే స్పందించి నాలా మరమ్మతు పనులు చేపట్టాలని, వరద నీరు ఆసుపత్రికి చేరకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నగరంలో భారీ వర్షాలు ఉంటాయని వెదర్ రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదన్న హరీశ్ రావు ఇది దుర్మార్గం.. క్రిమినల్ నెగ్లిజెన్స్ అన్నారు. వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం, ప్రణాళికలు వేయడంలో వైఫల్యం, ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం చెందిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే హైదరాబాద్ జల దిగ్బంధంలో చిక్కుకుందని తెలపారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఎంజీబీఎస్ లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, ప్రజలు భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారని వెల్లడించారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలని కోరిన హరీశ్ రావు రేవంత్ రెడ్డి మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించాలన్నారు. మూసీ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.. ఎప్పటికపుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తం చేస్తూ, ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పించాలని హరీశ్ రావు సీఎంను కోరారు. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరీశ్ రావు కోరారు.