27-09-2025 11:30:31 AM
హైదరాబాద్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) భారీ వర్షాల నేపథ్యంలో ఎక్స్ లో ప్రయాణికులకు కీలక సూచన జారీ చేశారు. మూసీ నదికి భారీ వరద(Musi River Flood) నేపథ్యంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (Mahatma Gandhi Bus Station) ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్(MGBS Bus Station) నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది.
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి. మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.