27-09-2025 11:42:13 AM
పండుగ పూట మహిళలకు ప్రభుత్వం మొండిచేయి
బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి
మానకొండూరు, (విజయక్రాంతి): ఎనిమిదేళ్లపాటు నిరాటకంగా కొనసాగిన బతుకమ్మ చీరల(Bathukamma sarees) పంపిణీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసిందని బీ ఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిది శాతరాజు యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేసి గడప, గడపకు పల్లె, పట్టణ లోగిళ్ళలో ఆనందాలు నింపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పండగపూట మహిళలకు మొండి చేయి చూపి పండుగ సంతోషాన్ని ఆవిరి చేసిందని చెప్పారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులందరికీ త్వరలో రెండేసి చీరల చొప్పున పంపిణీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆడపడుచులందరికీ చీరలు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగకు చీరలు అందించక, పండుగ తర్వాత చీరలు పంపిణీ చేసినా ప్రయోజనం ఉండదన్నారు. పండుగ తర్వాత చీరల పంపిణీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులు సకాలంలో తగినన్ని చీరలు అందించలేదని, అందుకే చీరలు పంపిణీ చేయడం లేదని మంత్రి సీతక్క ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందస్తు ప్రణాళిక లోపంతోనే చీరల పంపిణీ చేయలేకపోయారని నెపం చేనేత కార్మికుల పై నెట్టివేయడం మంత్రి సీతక్కకు తగదన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కుతో పాటు అదనంగా తులం బంగారం అందిస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఏమైందని యాదగిరి ప్రశ్నించారు. ఏ ఒక్కరికైనా తులం బంగారం అందించిన దాఖలాలు లేవన్నారు. అమలు కానీ హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో విఫలమైందన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు రూపాయలు 2500, విద్యార్థులకు స్కూటీలు, పెన్షన్ల పెంపు, యువ వికాసం, హామీలు బుట్ట దాఖలు అయిందన్నారు. ప్రభుత్వం పాలనలో విఫలమైందని ఆయన విమర్శించారు.