ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా?
హైదరాబాద్,(విజయక్రాంతి): గజ్వెల్ లో కేసీఆర్ కి వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు, నిరూపించేందుకు సిద్దమా..? నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా? అని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్ కౌంటర్లు అశాంతిని రేపుతున్నాయని విమర్శించారు. ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య పాలన అని డబ్బాకొట్టారని, ప్రజాస్వామ్య పాలనకు తూట్లు పొడిచారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ, ఈ యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకొని ఎకరాకు 15 వేల ఇస్తారనుకుంటే మొండి చెయ్యి చూపారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాకుండా కాంగ్రెస్ కట్టించిన ప్రాజెక్టులతోనే కోటి 53 లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.
2023-24 నాటికి కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎలా సాధ్యం అయ్యింది?, 2014-15 లో లక్షా 31 వేల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి 2లక్షల 21 వేల ఎకరాలకు ఎలా పెరిగింది? అని ప్రశ్నించారు. చెప్పేవాడికి ఇంగితం లేకున్నా వినేవాడికైనా వివేకం ఉంటది కదా! అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమ కంటే, గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించిందన్నారు. మాకొద్దు ఫార్మాసిటీ అంటూ లగచర్లలో లడాయి చేసిన గిరిజన బిడ్డలను అరెస్టులు చేయించి, ఇప్పుడేమో వారి మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కార్చుతున్నావని హరీశ్ రావు ఫైర్ అయ్యావు. పాలమూరుకు ఏం చేసావని కేసీఆర్ ని ప్రశ్నించే హక్కు మీకెక్కడిది..? అని అడిగారు. కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను కేసీఆర్ మార్చారన్నారు.
కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27వేల ఎకరాలు సాగైతే, దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచామని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి 90శాతం పూర్తి చేస్తే, ఏడాది పాలనలో మీరు మిగిలిన చివరి పనులు కూడా పూర్తి చెయ్యక చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వెల్ లో కేసీఆర్ కి వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్దమా? నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా? అని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తున్నావని, తాము ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మీ ఏడాది పాలన అసలు రంగు బయట పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ముందా..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.




