21 May, 2026 | 8:09 AM

రుణమాఫీ చేసి తీరాల్సిందే!

23-08-2024 03:13 AM
  1. ఆంక్షలు లేకుండా అమలు చేయాలి 
  2. రైతులతో రాజకీయాలు చేయొద్దు 
  3. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆందోళనలు 
  4. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ 

విజయక్రాంతి నెట్‌వర్క్ : అన్నదాతలకు అండగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఏకమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేసి తీరాల్సిందేనని గొంతెత్తాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని నినదించాయి. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో గులాబీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. దేశానికి అన్నంపెట్టే రైతులతో రాజకీయాలు చేయోద్దని హితవు పలికారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. 

హోరెత్తిన నిరసనలు

ఆదిలాబాద్ నిరసన దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ చేయా లని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని జయశంకర్ స్మృతి వనం వద్ద ధర్నాలో పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేటలో నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల విద్యాసాగర్‌రావు హాజరై, మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ గుప్తా దీక్షలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్, ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బిచ్కుందలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.

మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య  ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. నల్లగొండ, నాగార్జున సాగర్, నకిరేకల్, మిర్యాలగూడ, మునుగోడులో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.