21 May, 2026 | 9:15 AM

బిల్లులు భారీగా పెండింగ్!

23-08-2024 01:40 AM
  1. నిండుకున్న రాష్ట్ర ఖజానా 
  2. రూ.5 వేల కోట్ల మేర నిలిచిన బిల్స్ 
  3. రెండేళ్లుగా ఉద్యోగుల ఎదురుచూపులు 
  4. తీవ్ర ఆందోళనలో ఎంప్లాయీస్, టీచర్స్ 

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు భారీగా పెండింగ్‌లో పడిపోయాయి. తమ అవసరాల కోసం జీపీఎఫ్ నుంచి డబ్బులను తీసుకుందామనుకుంటే తీసుకోలేని పరిస్థితి నెలకొంది. బిల్లుల కోసం దరఖాస్తు చేసుకొని నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా అవి మాత్రం మంజూరు కావడంలేదని ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం సంవత్సరాల తరబడిగా ఎదురుచూస్తున్నా  క్లియర్ కావడంలేదని మనోవేదనకు గురవుతున్నారు. 2022 2023 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన బిల్లులు, వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బిల్లులు సుమారు రూ.5 వేల కోట్ల వరకు పెండింగ్‌లోనే ఉన్నట్లు సమాచారం.

ఈ బిల్లులన్నీ పెండిగే..

ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ రకాల బిల్లులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ (టీజీజీపీఎఫ్), పార్ట్ ఫైనల్, గ్రాట్యు టీ, తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా (టీజీజీఎల్‌ఐ), మెడికల్ రీయింబర్స్‌మెంట్, వాహన, గృహ రుణాల బిల్లులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ బిల్లులేవీ విడుదల కావడంలేదు. ట్రెజరీ ఆఫీసుల నుంచి టోకెన్లు జనరేట్ అవుతున్నా, ‘ఈ నుంచి డబ్బులు మాత్రం ఉద్యోగుల అకౌంట్లలో జమకావడంలేదు.

ఖర్చుల కోసం అప్పు.. 

ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, ఇళ్ల నిర్మాణాల కోసం పెట్టుకున్న బిల్లులు ఆర్థికశాఖ నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ కావడంలేదు. ఓ టీచర్ తన కూతురి పెళ్లి కోసం జీపీఎఫ్ నుంచి రూ.5 లక్షలు తీసుకుందామని బిల్లు చేసి ట్రెజరీకి పంపిస్తే.. పెళ్లు సంవత్సరమవుతున్నా బిల్లు మాత్రం మంజూరు కావడం లేదు. రూ.10 లక్షలు తీసుకొని ఇంటి నిర్మాణం చేపడుదామన్నా డబ్బులు అందడంలేదు.

తమ పిల్లల పైచదువుల కోసం అవసరమై దరఖాస్తు చేసుకుంటే అవి మంజూరు కాని పరిస్థితి నెలకొంది. దీంతో తెలిసిన వారి దగ్గర అప్పు చేస్తున్నారు. అలాగే మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులూ పెండింగ్‌లో ఉంటున్నాయి.  ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కింద నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ పథకం కింద చికిత్స చేయడానికి కొన్ని ఆస్పత్రులు ముందుకు రావడంలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొంది, వాటి తాలూకు బిల్లులను మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా రూ. 2 నుంచి 3 లక్షలు మించి మంజూరు చేయడంలేదు. ఇవి కూడా సకాలంలో విడుదల కావడంలేదు. పది నుంచి 12 నెలల సమయం పడుతుంది.

రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు మోక్షం లేదు..

2021లో అప్పటి ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 ఏళ్లకు పెం చింది. దీంతో అప్పట్లో రిటైర్ అవ్వాల్సిన వారంతా మూడేళ్ల కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఏడాది మార్చి 30 నుంచి రిటైర్మెంట్లు ప్రారంభమయ్యాయి. ప్రతీ నెలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదుల సంఖ్యలో రిటైర్ అవుతున్నారు. వారికి గ్రాట్యుటీ, జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

వీటితోపాటు ప్రతి నెలా ఇచ్చే పింఛను ఖరారు చేసి మరుసటి నెల నుంచి మంజూరు చేయాలి. ఈ బిల్లుల కోసం రిటైర్ అయ్యే సమయానికి నెల రోజుల ముందు నుంచే దరఖాస్తులను సమర్పిస్తుంటారు. ఒక సీనియర్ టీచర్ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందితే ఆయనకు దాదాపు రూ.40 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందడంలేదు. పింఛను మినహా ఇతర బిల్లు లన్నీ పెండింగ్‌లో ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతోనే..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతం మాత్రంగానే ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లోనే దాదాపు వేల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. మొత్తం కలిపి 20 వేల బిల్లు వరకు పెండింగ్‌లో ఉండొచ్చని అంచనా. రాష్ట్ర అప్పు దాదాపు రూ.7 నుంచి 8 లక్షల కోట్లు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఒకవైపు సబ్సిడీలు, సంక్షేమ పథకాల అమలు, మరోవైపు హామీల అమలుతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోంది.

ఖజానాలో నిధులు నిండుకోవడంతోనే పెండింగ్ బిల్లులను ఆర్థిక శాఖ క్లియర్ చేయలేని పరిస్థితి నెలకొంది. వివిధ మార్గాల ద్వా రా రాబడులు వస్తున్నా, అవి  సంక్షేమ పథకాలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతున్నాయి. పైగా రాష్ట్ర అవసరాల కోసం ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోంది. ఇక ఈ పెండింగ్ బిల్లులను మంజూరు చేసే పరిస్థితి ఉండడంలేదు.

విడుతల వారీగా విడుదల చేయాలి..

బిల్లులను ఆర్థిక శాఖ మంజూరు చేయడంలో ఆలస్యమవుతోంది. పెండిం గ్ బిల్లులను విడుతల వారీగానైనా విడుదల చేయాలి. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసమైనా బిల్లులు క్లియర్ చేయాలి. అప్పు చేయాల్సి చదివించుకోవాల్సి వస్తోంది. టీచర్లు తమ పిల్లల పెళ్లిళ్ల కోసమని బిల్లు పెట్టుకుంటే పెళ్లు ఏడాదైనా రాని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దశలవారీగా ప్రభుత్వం బిల్లులను మంజూరు చేస్తే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతారు.

 చావా రవి, 

టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి