7న హెచ్‌సీఏ టీజీ20 లీగ్ వేలం
హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ క్రికెట్ చరిత్రలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్లేయర్ల వేలానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా ఫ్రాంచైజీ ఆధారిత పద్ధతిలో జరగనున్న ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్ వేలం పాటను ఆదివారం నిర్వహించనున్నారు.
ఈ లీగ్‌లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు తలపడనుండగా 21 రోజుల పాటు ఉప్పల్ స్టేడియంలో మొత్తం 32 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా హెచ్‌సీఏలో రిజిస్టర్ అయిన 1,300 మందికి పైగా క్రికెటర్లు ఈ వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నా రు. భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు మహ్మ ద్ సిరాజ్, తిలక్ వర్మల ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
వేలం ప్రక్రియ మొదట ఐకాన్ కేటగిరీతో ప్రారంభమై ఆ తర్వాత ఏ ప్లస్, ఏ, బి, సి1, సి2 కేటగిరీల వారీగా కొనసాగుతుం ది. ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 20 మంది ఆటగాళ్లతో తమ జట్టును నిర్మించుకోవచ్చు. ప్రతి జట్టుకు వేలం లో ఆటగాళ్లను కొనడానికి రూ.60 లక్షల బడ్జె ట్ (పర్స్ మనీ) కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశం తో.. ప్రతి ఫ్రాంచైజీ తమ 20 మంది సభ్యుల జట్టులో కనీసం నలుగురు జిల్లా ఆటగాళ్లను చేర్చుకోవాలి. అలాగే తుది జట్టులో కనీసం ఇద్దరు జిల్లా ప్లేయర్లు ఆడటం తప్పనిసరి.






