calender_icon.png 4 October, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టుకున్నోడే కాలయముడయ్యాడు

04-10-2025 02:36:19 AM

  1. వేర్వేరు ఘటనల్లో భార్యలను చంపిన భర్తలు
  2. మనస్పర్థలతో ఒకచోట.. అడ్డు వచ్చిందని మరోచోట..

నారాయణపేట/మహబూబాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనలో భర్తలు కట్టుకున్న భార్యలనే దారుణంగా హత్య చేశారు. నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనల్లో తాళి కట్టిన వాళ్లే హతమార్చారు. వివరాలు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సత్యారం గ్రామానికి చెందిన భార్యాభర్తలు వినోద, బాలకృష్ణారెడ్డిల మధ్య కొన్ని రోజులుగా    మనస్పర్థలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. దసరా పండుగ సందర్భంగా బాలాకృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లారు.

అక్కడ భోజనం అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. అయితే భార్య భర్తలు మాత్రం పొలంలోనే ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన భర్త ముందే పథకం ప్రకారం తన వెంట తెచ్చుకొన్న కత్తితో భార్య వినోదను పొడిచి పరారయ్యాడు. వినోద తల్లి తండ్రులు తమ కూతురు రాలేదని పొలంలోకి వెళ్లి చూడగా మె రక్తం మడుగులో పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.   హాస్పిటల్‌కు తరలించేలోపే వినోద మృతి చెందినట్లు సీఐ రామ్‌లాల్ తెలిపారు. ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి లు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న బాలకృష్ణారెడ్డిని పట్టుకోవటం కోసం ప్రత్యేక బృందాలను పంపినట్లు ఆయన తెలిపారు.

అడ్డు చెప్పిందని...

 తన కొడుకును మందలిస్తున్న సమయంలో భార్య అడ్డుచెప్పిందని భర్త ఆమెను హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చిర్ర రమేష్ బాబు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నరేష్, స్వప్న దంపతుల కుమారుడు విక్రమ్ దసరా పండుగ రోజు మద్యం తాగి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో  తండ్రి నరేష్ విక్రమ్‌ను మందలిస్తుండగా భార్య స్వప్న అడ్డుచెప్పింది. దీంతో నరేష్ తన భార్యే కొడుకు చెడిపోవడానికి కారణమంటూ ఆగ్రహించి ఆమెపై గొడ్డలితో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు. సంఘటనస్థలాన్ని కేసముద్రం సీఐ సత్యనారాయణ సందర్శించి దర్యాప్తు చేపట్టారు.