calender_icon.png 26 September, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసి పిల్లలపై అంత పగెందుకు?

26-09-2025 12:14:19 AM

  1. అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అన్నదమ్ముల మృతి
  2.   9 నెలల క్రితం సంపులో పడి తమ్ముడు నిహాల్ కన్నుమూత
  3. గురువారం నిద్రలోనే.. ప్రాణాలు విడిచిన అన్న మనీష్ 
  4. మనీష్ మెడ చుట్టూ వైర్ చుట్టి ఊపిరాడకుండా హత్య?
  5. గతంలోనూ ఇద్దరిపై హత్యా ప్రయత్నాలు?
  6. మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో ఘటన

మహబూబాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): 9 నెలల వ్యవధిలో అన్నదమ్ములైన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్, శిరీష దంపతులు. వారికి కుమారులు మనీష్‌కుమార్(6), మోక్షిత్(4), నిహాల్ (18 నెలలు). ఉపేందర్ గ్రీన్ ఫీల్ హైవే పనుల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

నిహాల్ 9 నెలల క్రితం నీటి సంపులో పడి మృతిచెందగా.. మనీష్‌కుమార్ బుధవారం నిద్రలోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బుధవారం ఉపేందర్ విధులు నిర్వహించేందుకు వెళ్లగా.. నాయనమ్మ మంగమ్మ కూలి పనికి వెళ్లింది. తాత ఎల్లయ్య మేకలు కాసేందుకు వెళ్లాడు. ఇంట్లో మనీష్ కుమార్ తో పాటు తల్లి ఉంది. సాయంత్రం వచ్చిన మంగమ్మ, ఎల్లయ్య మనీష్ ఏడి అంటూ కోడలును అడగగా నిద్రపోతున్నాడని చెప్పింది.

రాత్రి వరకు కూడా మనీష్ లేవకపోవడంతో దగ్గరకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. బాలుడు మృతి చెందినట్లు చెప్పాడు. బాలుడి మెడ చుట్టూ గాయాలు ఉండటంతో తండ్రి ఉపేందర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ మురళీధర్ రాజ్ అక్కడికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో కేసు దర్యా ప్తు చేపట్టారు. మనీష్ గొంతు చుట్టూ వైర్‌తో బిగించి, ఊపిరాడడకుండా చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా రెండు నెలల క్రితం మనీష్ నాయనమ్మ వద్ద నిద్రిస్తుండగా పదునైన ఆయుధంతో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోశారు. బాలుడు గట్టిగా ఏడవడంతో మంగమ్మ లేచింది. గమనించిన దుండగులు పారిపోయారు. వెంటనే మనీష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా ప్రాణాలతో బయటపడ్డాడు. 

9 నెలల క్రితం నిహాల్ మృతి

మనీష్ తమ్ముడు ఏడాదిన్నర వయసు గల నిహాల్ ఈ ఏడాది జనవరి 15న నీటి సంపులో పడి మృతిచెందాడు. అయితే నిహాల్ మరణానికి కొద్దిరోజుల ముందు అదే నీటి సంపులో పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండగా స్థానికులు గమనించి వెంటనే అతన్ని బయటకు తీసి మింగిన నీటిని బయటకు తొలగించి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటన జరిగిన 15 రోజులకు మళ్లీ అదే సంపులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇప్పుడు అన్న మనీష్ కూడా అనుమానాస్పద స్థితిలోనే మృతిచెందడం గమనార్హం. 

పథకం ప్రకారమే హత్య?

తెలిసినవారే,  చిన్నారులిద్దరిని పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిహాల్ మృతిచెందినప్పుడుగానీ, రెండు నెలల క్రితం మనీష్‌పై హత్యాయత్నం జరిగినప్పుడుగానీ పోలీసులు లోతుగా విచారణ జరిపితే మనీష్ ప్రాణాలతో ఉండేవాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలిసినవారే పిల్లల్ని హత్య చేసి ఉంటారని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కూడా ఇదే కోణంలో ముమ్మరంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.