1 July, 2026 | 1:11 AM

ఆయన నన్ను ముత్యంలా తీర్చిదిద్దారు!

01-07-2026 12:00 AM

* విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం : ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేశ్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, రిషబ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విరాట్ కర్ణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 

* నా తొలి సినిమా ‘పెదకాపు’ భారీ బడ్జెట్ సినిమా. ఇప్పుడు ‘నాగబంధం’ కూడా చాలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. కెరీర్ ప్రారంభంలోనే వరుసగా రెండు భారీ సినిమాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. నిర్మాతలు తొలి సినిమాకే ఇంత గొప్పగా నిర్మించడం మామూలు విషయం కాదు. 

* అభిషేక్ నామా ‘నాగబంధం’లోని పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలున్న కొత్త వ్యక్తి వెతుకుతూ, నన్ను పిలిచి ఈ కథ చెప్పారు. ఈ కథ నా కోసమే రాసినట్టు అనిపించింది. రుద్ర, నాగసాధు పాత్రల గురించి చెప్పినప్పుడు చాలా ఉత్సాహంగా అనిపించింది. వెంటనే పాత్రకు తగ్గట్టు నన్ను నేను పూర్తిగా మార్చుకున్నా.

హార్స్ రైడింగ్ నేర్చుకున్నా. డాన్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టా. ముఖ్యంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నా. రుద్ర పాత్ర కోసం దాదాపు 20 కిలోల బరువు పెరిగా. తర్వాత నాగసాధువుగా కనిపించడానికి మరో ఐదు కిలోలు తగ్గా. నాగసాధు పాత్ర మేకప్‌నకు ఆరు గంటల సమయం పట్టేది. 

* షూటింగ్ సమయంలో ప్రతిరోజూ ఒక శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడిని. షూటింగ్ పూర్తయ్యాక శివమాల కూడా ధరించా. ఆ ప్రయాణంలో ఎన్నో శివాలయాలు సందర్శించా. షూటింగ్ సమయంలో నాకు జ్వరం ఉన్నా వెనకడుగు వేయలేదు. 

* ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్ చేశాం. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ సీన్స్‌కు డూప్ ఉపయోగించలేదు. అన్ని యాక్షన్ సన్నివేశాలు నేనే స్వయంగా చేశా. నాకు మొదటి నుంచే జిమ్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ పాత్ర కోసం సిద్ధమయ్యే సమయంలో ఒక కండరం దెబ్బతిన్నది. దాంతో డాక్టర్లు ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించారు. 

* తీవ్రమైన చలికాలంలో షూటింగ్ చేశాం. ఒక సన్నివేశంలో పాత్ర ప్రకారం శరీరంపై ఏమీ ఉండకూడదు. ఒక యాక్షన్ సీన్ చేస్తున్నపుడు చలికి నా శరీరం పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది. వెంటనే నన్ను కారవాన్‌కు తీసుకెళ్లి మేకప్ తొలగించి, ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన తర్వాత అంతా నార్మల్‌గా ఉందని చెప్పారు. మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లిపోయా. 

* అభిషేక్ నామాకు మాస్ పల్స్ బాగా తెలుసు. ఆయన తీసిన ప్రతి సన్నివేశం నాకు గూస్‌బంప్స్ కలిగించింది. కానీ, ఇంత భారీ సినిమా చేస్తున్నప్పుడు మొదట్లో కొంచెం భయపడ్డా. అయితే, ఆ ఒత్తిడిని మొత్తం మా డైరెక్టర్ తీసుకున్నారు. ‘మంచి సినిమా చేస్తున్నాం.. ఇవేమీ ఆలోచించకు’ అని ఎప్పుడూ ధైర్యం చెప్పేవారు. 

* ఈ సినిమా నాలో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఒక నటుడిగా చాలా విషయాలు నేర్చుకున్నా. అభిషేక్ నామా నన్ను ఒక ముత్యంలా తీర్చిదిద్దారని భావిస్తున్నా. సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలనే ప్లాన్ ఉంది. త్వరలో కొత్త సినిమాలు ప్రకటిస్తా.