23 July, 2026 | 12:42 AM

ఓటు హక్కు లేకుంటే చనిపోయినట్టే

23-07-2026 12:00 AM
  1. ‘సర్’ను సద్వినియోగం చేసుకోండి
  2. బీఎల్‌ఏలు ఓటరు నమోదు ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి 
  3. కొడంగల్‌లో వివరాలు నమోదు చేసుకున్న సీఎం

కొడంగల్, జూలై 22 (విజయక్రాంతి): ఓటు హక్కు లేకుంటే చనిపోయిన వారితో సమానమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కొడంగల్ నియోజకవర్గ బూతు స్థాయి ఏజెంట్లతో పరిగి, తాండూర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, బుయ్యాని మనోహర్‌రెడ్డి లతో కలిసి సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే సర్ ప్రక్రియలో భాగంగా కొడంగల్‌లోని నివాసంలో తన వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఓటు హక్కు కోల్పోకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాల్సిన బాధ్యత బూత్ స్థాయి ఏజెంట్లదేనన్నారు. సర్ ప్రక్రియను చేపట్టేందుకు ఆగస్టు 3వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం గడువును పొడిగించింనది చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో 78 శాతం ప్రక్షాళన జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో 2,51,255 ఓటర్లకు గాను 1,96,620 ఓటర్ల నమోదు అయినట్టు వెల్లడించారు.

మిగతా 54,635 వేల ఓట్ల నమోదును చేయాల్సి ఉన్నదన్నారు. దీనిపై బీఎల్‌ఏలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వలస వెళ్లిన కుటుంబాలను గుర్తించి ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడాలని సూచించారు.  ఓటరు జాబితా పేరు లేనట్లయితే సంక్షేమ ఫలాలు కోల్పోతారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి తెలిపారు.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళల ఓట్లు తప్పిపోకుండా చూడాలని ఆయన అన్నారు. సీఎం వెంట కొడంగల్, నారాయణపేట్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు రాజేష్ రెడ్డి, విజయ్ కుమార్,  మున్సిపల్ చైర్మన్లు నందారం ప్రశాంత్, నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ శివకుమార్ ఉన్నారు.