శతక్కొట్టిన హెడ్, స్మిత్
- పట్టుబిగించిన ఆస్ట్రేలియా
- ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 518/7
సిడ్నీ, జనవరి 6: యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. ఇంగ్లాం డ్ స్కోరుకు ధీటుగా బదులిచ్చిన కంగారూలు మూడోరోజు కూడా పూర్తి ఆధిపత్యం కనబరిచారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్(129 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోర్ 166/2తో ఇన్నింగ్స్ కొనసాగిం చిన ఆసీస్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు.
ముఖ్యంగా హెడ్ ఇంగ్లీష్ బౌలర్లను ఆటాడుకున్నాడు. దూకుడుగా ఆడుతూ టెస్టుల్లో 12వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ యాషెస్ సిరీస్‌లో అతనికిది మూడో శతకం. నెసర్(24) ఔటైనప్పటకీ స్మిత్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. హెడ్ 163 (24 ఫోర్లు, 1 సిక్సర్) పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. అటు స్మిత్ మాత్రం మరోసారి తన క్లాసిక్ బ్యాటింగ్‌తో అలరించాడు. ఈ క్రమంలో తన టెస్ట్ కెరీర్‌లో 37వ శతకం సాధించాడు. తద్వా రా యాషెస్‌లో అరుదైన రికార్డును కూడా అందుకున్నాడు.
ఈ సిరీస్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. తొలి స్థానంలో బ్రాడ్‌మన్(5028) ఉండగా.. స్మిత్ (3682) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే యాషెస్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డులోనూ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానం స్మిత్‌దే. ఈ సిరీస్ చరిత్రలో బ్రాడ్‌మన్ 19 శతకాలు చేస్తే స్మిత్ 13 సెంచరీలు సాధించాడు.
అలాగే ఇంగ్లాండ్‌పై 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. స్మిత్ శతకంతో ఆస్ట్రేలియా మూడోరోజు ఆటముగిసే సమయా నికి 7 వికెట్లకు 518 పరుగులు చేసింది. తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా(21) పరుగులకు ఔటవగా.. స్మిత్, వెబ్‌స్టన్ 8వ వికెట్‌కు అజేయంగా 81 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఆసీస్ 134 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. స్మిత్ 129, వెబ్‌స్టర్ 42 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.




