07-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను బిగ్ అకాడమీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. నగరంలోని నోవోటెల్ హెచ్‌ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో యువరాజ్ సింగ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి. ఆనంద్, బిగ్ టీవీ వ్యవస్థాపకుడు ఛైర్మన్ విజయ్‌రెడ్డి, బిగ్ టీవీ మలయాళం వ్యవస్థాపక డైరెక్టర్, మేనేజింగ్ ఎడిటర్ అనిల్ ఆయూర్‌లతో కలిసి బిగ్ అకాడమీని ప్రారభించారు.
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న విద్యా వ్యవస్థలో సరికొత్త ఆవిష్కరణలను, జవాబు దారీతనాల ప్రాముఖ్యతను యువరాజ్‌సింగ్ ప్రత్యేకంగా ప్రధానంగా ప్రస్తావించారు.అలాగే తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారనీ, వారి త్యాగలను ఎప్పటికీ మరిచిపోవద్దని విద్యార్థులకు యువీ సూచిం చారు. ఇదిలా ఉంటే విద్యా నైపుణ్యాన్ని మానసిక శ్రేయస్సు తో సమతుల్యం చేసే నిర్మాణాత్మక విద్యా వ్యవస్థను సృష్టించాల్సి ఉందని బిగ్ అకాడమీ వ్యవస్థాపకుడు, సిఇవో రమణ భూప తి అభిప్రాయపడ్డారు.
సాంకేతికతను మానవ మార్గదర్శకత్వం తో కలపడం తద్వారా కేవలం పరీక్షలకు మాత్రమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో దీర్ఘకాలిక విజయాలకు సిద్ధంగా ఉన్న వారిని తయారు చేయడమే బిగ్ అకాడమీ ఐఐటీ జెఇఇ లో తమ లక్ష్యంగా పేర్కొన్నారు. డిజిటల్ పాఠాలు, మూల్యాంకనాలు, పనితీరు ట్రాకింగ్, ఆఫ్‌లైన్ విద్యా మార్గదర్శకత్వాలను అనుసంధానించే వేదికగా తమ హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా పాల్గొన్నారు.