ఆరోగ్యమే మహాభాగ్యం
గర్భిణీలు జాగ్రత్తలు వహించాలి: కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 8(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవాల సందర్భంగా, బుధవారం ఎలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘సురక్షిత మాతృత్వ దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు సరైన పోషకాహారం తీసుకుంటూ, ఆశా వర్కర్ల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు పొందాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 57% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరుగుతున్నాయి. మాతా శిశు మరణాలను తగ్గించి, సాధారణ ప్రసవాలను మరింత ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు 9 నుండి 14 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ ఎంతో మేలు చేస్తుందని, జిల్లాలోని 22 కేంద్రాల్లో ఇది ఉచితంగా అందుబాటులో ఉందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న డ్రగ్స్ సంస్కృతిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు సూచించారు.డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితా దేవి మాట్లాడుతూ.. జిల్లాలో మాతృ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ప్రసవానంతర సేవలను పటిష్టంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




